ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అనుచిత ప్రవర్తన కారణంగా సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయబడిన వైకాపా ఎమ్మెల్యే రోజా కేసుపై సుప్రీం కోర్టు శుక్రవారం మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ఆ తీర్పు వివరాలు తెలియవలసి ఉంది. కానీ అందిన సమాచారం ప్రకారం ఆమె ఆ రోజు శాసనసభలో తన సస్పెన్షన్ కి దారి తీసిన పరిస్థితులను, దానిపై తన వివరణను ఒక లేఖ ద్వారా సుప్రీం కోర్టుకి తెలియజేసినట్లు సమాచారం. అయితే ఆమె తన అనుచిత ప్రవర్తనకు పశ్చాతాపం వ్యక్తం చేస్తూ లేఖలో క్షమాపణ కోరలేదని తెలుస్తోంది. ఆ లేఖపై రెండు నెలలలోగా రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా సుప్రీం కోర్టు ఆదేశించినట్లు సమాచారం. క్షమాపణలు లేకుండా ఇచ్చిన ఆ లేఖను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోబోదని ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది సుప్రీం కోర్టు సూచించినట్లు తెలుస్తోంది.
సుప్రీం కోర్టు నిన్న అక్షింతలు వేసిన తరువాత రోజా ఒకమెట్టు దిగివచ్చినట్లు మాట్లాడినా మళ్ళీ ఈరోజు కోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను బట్టి చూస్తే ఆమె వైఖరిలో ఎటువంటి మార్పు కలగలేదని స్పష్టం అవుతోంది. కనుక ఆమెపై సస్పెన్షన్ కొనసాగడం తప్పకపోవచ్చు. ఆమెను సభ నుంచి సస్పెండ్ చేసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ అందుకు తను బాధపడటం లేదని చెప్పారు. సుప్రీం కోర్టు చేత అక్షింతలు వేయించుకొన్న తరువాత కూడా ఆమెలో పశ్చాతాపం, మార్పు కలగకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.