అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత, ప్రతిపక్ష పాత్రలో ఇవాళ్ల అసెంబ్లీలోకి టీడీపీ అడుగుపెడుతోంది. నిజానికి, ఆ పార్టీకి ఇదేమీ కొత్త అనుభవం కాదు. దివంగత వైయస్సార్ హయాంలో దాదాపు పదేళ్లపాటు ప్రతిపక్షంలోనే ఉంది. అయితే, ఇప్పుడు అతి తక్కువ ఎమ్మెల్యేల సంఖ్యతో ఇప్పుడు సభలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో, అసెంబ్లీలో ఎలాంటి పాత్ర పోషించాలి, ఎమ్మెల్యేలంతా ఎలా వ్యవహరించాలనే అంశంపై నిన్ననే చాలా చర్చ జరిగింది. ఈ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాత్ర ఎలా ఉండాలనేది ఇప్పుడు చర్చనీయంగా మారుతోంది. నిన్నటి సమావేశంలో దీన్ని ప్రముఖంగా నేతలు చర్చించకపోయినా, ఆఫ్ ద రికార్డ్ కొంతమంది నాయకులు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా పనిచేశారు. అంటే, కొంత అనుభవం వచ్చినట్టే. అయితే, ఇకపై పూర్తిగా ప్రజల్లో ఉండాలనీ, కార్యకర్తలకు అందుబాటులోకి ఉండాలని ఆయనే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోనంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. ఇదే పంథాను ఆయన కొనసాగిస్తే మంచిది అనేది పార్టీ నేతల అభిప్రాయంగా గెలుస్తోంది. అంతేకాదు, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలున్నాయి. కాబట్టి, మండలాలవారీగా పార్టీ సమీక్షలు నిర్వహించాలనీ, వీటిని నారా లోకేష్ ఆధ్వర్యంలోనే జరిగితే బాగుంటుందనే అభిప్రాయమూ వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వ విధానాలపై పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు స్పందిస్తారనీ, కార్యకర్తలూ పార్టీలకి సంబంధించిన ఇతర వ్యవహారాల్లో లోకేష్ ని మరింత క్రియాశీలం చేయాలనే ఉద్దేశంలో పార్టీ ఉంది.
వయసు రీత్యా చంద్రబాబు నాయుడు మరో ఐదేళ్లపాటు పార్టీని ఎలా నడిపిస్తారూ అనే అభిప్రాయాలూ పార్టీలోనే వినిపిస్తున్నాయి. కానీ, ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఆయనకీ కొత్త కాదు. కాకపోతే, ఆయన తరువాతి స్థానంలో నారా లోకేష్ మరింత సమర్థంగా కనిపించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. సవాళ్లలోంచి అవకాశాలను సృష్టించుకోవాలని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నారా లోకేష్ పని చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో, ప్రజల్లో తనకంటూ ఒక ఇమేజ్ ను ఆయన బిల్డప్ చేసుకోవాలంటే దానికి వేరే ఏ షార్ట్ కట్ అంటూ ఏం లేదు. నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే, సమస్యలపై నిత్యం పోరాటం చేయాల్సిందే, ఎండావానా అనకుండా కష్టపడాల్సిందే, అధికార పార్టీ నుంచి ఎదురయ్యే అననుకూల పరిస్థితులను ఫేస్ చేయాల్సిందే, అంతిమంగా రాటు దేలాల్సిందే.