సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య చాలా రోజుల తరువాత తన స్వస్థలమయిన గుంటూరులో వేమూరుకి నిన్న వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని, రెండు రాష్ట్రాల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని వారిద్దరూ ఐక్యతగా మెలగాలని సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజన కారణంగా కొత్త సమస్యలు ఎదుర్కొంటున్న రెండు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయమార్గాలను పెంచుకొనే ప్రయత్నాలు చేస్తూనే ప్రజలపై ఆ భారం మోపకుండా జాగ్రత పడాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ఆదాయం బయటకు పోకుండా కట్టడి చేయాలని సూచించారు. జాతీయస్థాయి గవర్నర్ల సదస్సు జరిగినప్పుడు తను రెండు తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తానని చెప్పారు.
ఒకప్పుడు రోశయ్య రాష్ట్ర ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖను చాలా చక్కగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకొన్నారు కానీ వైస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి చాలా చెడ్డపేరు మూటగట్టుకొన్నారు. చివరికి రాష్ట్రాన్ని పాలించడం తనవల్ల కాదని చేతులు ఎత్తేయడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డిని నియమించవలసి వచ్చింది. బహుశః ముఖ్యమంత్రి పదవిని వదులుకొన్న మొట్టమొదటి వ్యక్తి రోశయ్యే కావచ్చు. అయితే ఆర్ధిక విషయాలపై ఆయనకున్న అవగాహన, పట్టుని ఎవరూ ప్రశ్నించలేరు. కనుక ఆ విషయంలో ఆయన చెపుతున్న సలహాలను రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వీకరించవచ్చు. కానీ వారిద్దరూ కలిసి పనిచేయాలని ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రస్తుతానికి వారి మధ్య కొంత సయోధ్య కనబడుతున్నప్పటికీ అది నిశబ్ధంగానే భావించవచ్చు. ఇరువురికీ ఒకరిపట్ల మరొకరికి గౌరవం లేదు. కనుక సహకరించుకోవాలనే ఆసక్తి లేదు. ఇద్దరూ తమ తమ రాష్ట్రాలను వేగంగా అభివృద్ధి చేసుకోవాలని గట్టిగా అనుకొంటున్నారు కానీ కలిసి అభివృద్ధి చేసుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. కారణాలు అందరికీ తెలుసు. కనుక రోశయ్య సలహాను వినేవారెవ్వరూ లేరనే చెప్పవచ్చు.