తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ అనే గుర్తింపు చాలా ఘనంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న ప్రజలకు గులాబీ పూలు ఇచ్చి గ్లాసు మజ్జిగతో సేదతీర్చి పంపితే… ఆ వచ్చిన వారు ఇదంతా గులాబీ పార్టీ చేసిన ఏర్పాటు కావచ్చునని భ్రమించే అవకాశం ఉంది కదా. అంతో ఇంతో తటస్థ బుద్ధితో వచ్చిన వారు కూడా.. గులాబీ పార్టీకి అనుకూలంగా ఓటు వేసేలా మారే అవకాశమూ ఉంటుంది కదా! మరి కొత్త సాంప్రదాయం ముసుగులో.. ఆదర్శ పోలింగ్ స్టేషన్లు అనే పేరిట ఓటర్లకు గులాబీ పూలు ఇచ్చే సంస్కృతి ఎందుకు ప్రారంభించారో గానీ ఇప్పుడు పలు విమర్శలు వస్తున్నాయి.
మెదక్జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యేకు ఉప ఎన్నిక పూర్తయింది. అచ్చంగా వరంగల్ తరహాలోనే సార్వత్రిక ఎన్నికలకంటె చాలా పెద్ద శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి రాజకీయ పార్టీ ప్రచారమూ నిర్వహించకూడదు. కనీసం పార్టీల గుర్తులు కూడా చూపించకూడదు. ఈ నిబంధనల మధ్యలో లొసుగుల్ని వెతుక్కుంటున్నట్లుగా.. 20 ఆదర్శ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు గులాబీ పూలు ఇచ్చి బొట్టుపెట్టి స్వాగతించడం మజ్జిగ ఇవ్వడం వంటి ఏర్పాట్లు అధికారులు చేశారు. అయితే ఇచ్చిన వాళ్లు ఎన్నికల వాలంటీర్లనే యూనిఫారం లాంటిది కూడా ధరించకపోవడంతో.. వారు గులాబీ పార్టీ (తెరాస) కార్యకర్తలే అని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది.
పోలింగ్ సమయానికి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఇదొక కొత్త టెక్నిక్కా? అని కొందరు విమర్శిస్తూ ఉంటే.. తెలుగుదేశం పార్టీ దీన్ని ఆదర్శంగా తీసుకుని.. ఇలా పోలింగ్ స్టేషన్ల వద్ద సర్కారు వారి ఖర్చుతో ఓటర్లకు చేమంతి పూలు, పసుపు బంతిపూలు ఇచ్చి స్వాగతించే ఏర్పాట్లు చేస్తుందేమో.. అని కొందరు జోకులేసుకుంటున్నారు.