`నిర్మలా కాన్వెంట్`తో తెరంగేట్రం చేశాడు శ్రీకాంత్ తనయుడు రోషన్. ఆ సినిమాలో రోషన్ లుక్ బాగానే వున్నా, కొన్ని లోపాలు కొట్టుకొచ్చినట్టు కనిపించాయి. దానికి తోడు సినిమా కూడా ఫ్లాప్. అందుకే ఇప్పుడు రీ లాంచ్ జరగబోతోంది. కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా.
`పెళ్లి సందD` పేరుతో రాఘవేంద్రరావు ఓ ప్రాజెక్టు మొదలెడుతున్న సంగతి తెలిసిందే. తన శిష్యురాలు గౌరిని ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో. ఇప్పుడు రోషన్ కి డైలాగులు, నటన విషయంలో మరిన్ని మెళకువలు నేర్పుతున్నారు రాఘవేంద్రరావు. డైలాగ్స్ లో రాటు దేలడానికి ప్రముఖ నటుడు రావు రమేష్ క్లాసులు తీసుకుంటున్నార్ట. ఈ తరం క్యారెక్టర్ ఆర్టిస్టులలో . డైలాగులు చెప్పడంలో మహా దిట్ట రావు రమేష్. అందుకే ఆయన్ని తీసుకొచ్చి.. డైలాగు పాఠాలు చెబుతున్నారు. డాన్సులు, పోరాట ఘట్టాలల్లోనూ.. రోషన్ ట్రైనింగ్ తీసకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయిక ఇంకా ఫిక్స్ కాలేదు. ఆమె ఎంపిక కోసం కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే హీరోయిన్ ని ఫిక్స్ చేసి, తనతో కూడా ప్రాక్టీస్ సెషన్ మొదలెట్టించాలని చిత్రబృందం భావిస్తోంది. డిసెంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.