ఈమధ్య పెద్ద బ్యానర్లు చిన్న సినిమాలపై దృష్టి నిలిపాయి. `జాతిరత్నాలు`తో చిన్నసినిమాల వల్ల ఉన్న లాభాలేమిటో అశ్వనీదత్ లాంటి అగ్ర నిర్మాతకు బాగా అర్థమైంది. అందుకే ఇప్పుడు మరో చిన్న సినిమాకి శ్రీకారం చుట్టారాయన. వైజయంతీ మూవీస్ పతాకంపై, అశ్వనీదత్ నిర్మాతగా ఓ చిన్న సినిమా రూపుదిద్దుకొంటోంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటించనున్నాడు. కథ రెడీ అయ్యింది. మిగిలిన అన్ని వివరాలూ త్వరలోనే చిత్రబృందం ప్రకటించబోతోంది. రోషన్ చేతిలో మరో సినిమా కూడా పడింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రోషన్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తోంది. అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి. `పెళ్లి సందడి`తో తెరపైకొచ్చాడు రోషన్. ఆ సినిమా రివ్యూల పరంగా అటూ ఇటూ ఊగినా, వసూళ్ల పరంగా మంచి లాభాలు అందుకుంది. దసరా సీజన్లో విడుదల కావడం పెళ్లి సందడికి కలిసొచ్చింది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండడం, డాన్సులు బాగా చేయడంతో.. తనకు ఆ సినిమా బాగా హెల్ప్ అయ్యింది. అందుకే వైజయంతీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంది. ముందు అశ్వనీదత్ సినిమా పూర్తి చేస్తాడు రోషన్. ఆ తరవాత… సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా పట్టాలెక్కుతుంది.