ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కపిల తీర్థం టు రామతీర్థం రథయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. విశాఖలో జరిగిన ఏపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆలయాల కూల్చివేతలను ఖండిస్తూ.. కపిలతీర్ధం నుంచి రామతీర్థం వరకూ యాత్రను.. ఫిబ్రవరి 4 నుంచి 8 రోజుల పాటు నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. దేవాలయాలపై దాడులు జరిగిన ప్రాంతాలను కలుపుతూ యాత్ర జరుగుతుంది.
పిఠాపురం, అంతర్వేది, విజయవాడ, నెల్లూరు, శ్రీశైలంలో అన్యమత ప్రాబల్యం వంటి ఘటనలపై జన జాగృతి సభలను నిర్వహిస్తారు. ఆలయాలపై ఏపీలో జరుగుతున్న దాడుల విషయంలో బీజేపీ సరైన విధంగా అడ్వాంటేజ్ తీసుకోలేకపోతోందన్న అభిప్రాంయ.. పార్టీ హైకమాండ్ వ్యక్తం చేసిందని.. అందుకే ప్రత్యేక కార్యాచరణను ఢిల్లీ నుంచి ఖరారు చేసి పంపారని చెబుతున్నారు. ఈ మేరకు వారి సూచనల ప్రకారం.. రామరథయాత్రను ఖరారు చేసుకున్నారని చెబుతున్నారు.
ముందుగా రామతీర్థం నుంచి ప్రారంభించాలనుకున్నప్పటికీ… అక్కడే ముగిస్తే మంచి ఎఫెక్ట్ వస్తుందని భావించారు. అందుకే కపిల తీర్థం నుంచి ప్రారంభించారు. కపిల తీర్థంలో ఎలాంటి వివాదాలు జరగకపోయినప్పటికీ.. అక్కడ్నుంచి ప్రారంభిస్తే మంచిదన్న ఉద్దేశంతో ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎనిమిది రోజుల యాత్రలో .. రోజుకో జాతీయ నేతను పపిలిపించాలని ప్లాన్ చేస్తున్నారు. రోజూ కుదరకపోయినా.. ప్రదానమైన ఆలయాల దగ్గరకు వచ్చినప్పుడు.. పిలిపించాలని అనుకుంటున్నారు. ఇక ముందుగా ప్రభుత్వాన్ని హిందూత్వ అంశంపైనే ఇరుకున పెట్టాలన్న నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. తమపై ఆరోపణలు చేసిన డీజీపీ విషయంలోనూ బీజేపీ సీరియస్ గా ఉంది.
డీజీపీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకని .. ఈ నెల 20 తేదీలోపు డీజీపీ క్షమాపణ చెప్పాలని సోము వీర్రాజు డెడ్ లైన్ పెట్టారు. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలనేదానిపై స్పష్టత లేదు కానీ.. ముఖ్య నేతలందరూ పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ముందుగానే రథయాత్ర చేపట్టాలన్న ఆలోచన వచ్చినప్పటికీ.. ఏర్పాట్ల కోసం సమయం కావాలని ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి.. హిందూత్వం విషయంలో బీజేపీ స్పందన లేట్ అనే ఫీలింగ్ ఉన్నా.. ఇప్పుడు రథయాత్ర కూడా లేటుగానే స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ తిరుపతిలో ఇరవై ఒకటో తేదీ నుంచి ధర్మ పరిరక్షణ యాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకుంది.