తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆ పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులంతా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు తమ డిమాండ్‌ను కేసీఆర్‌కు .. పార్టీ వేదికగా వినిపించారు. ఇక ముందు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, విప్‌లు, ఫ్లోర్ లీడర్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి పార్టీ మొత్తం ఆమోదం తెలిపిందని చెప్పుకోవడానికి ఇదో మార్గం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
టీఆర్ఎస్లోనే ఇలాంటి డిమాండ్ వినిపించడం ప్రారంభమయిందంటే.. ముందు ముందు అన్ని స్థాయిల నుంచి ఈ తరహా ప్రకటనలు వస్తాయి. దీన్ని పీక్స్‌కు తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. దసరాకు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి.. కార్యాచరణ ప్రారంభమైందని చెబుతున్నారు. తనను జాతీయ రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుతున్నారని… కేసీఆర్ పలుమార్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు బలపరిస్తేనే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని.. మళ్లీ బలపరిస్తే దేశాన్ని తెలంగాణలా బాగు చేస్తానని చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ఎన్నికల కంటే ముందే జరుగుతాయి కాబట్టి కేసీఆర్ ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత జాతీయ పార్టీపై గురి పెడతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ నేతల “ఒత్తిళ్లు” ప్రారంభం కావడంతో ఆయన ముందుగానే రంగంలోకి దిగబోతున్నట్లుగా చెబుతున్నారు. దసరాకు పార్టీ ప్రకటన తర్వాత ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తారు. సీఎంగా ఉంటూనే జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు.