ఏపీ సభ్యులు కేంద్రంపై ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా లేదు. నాలుగో రోజు కూడా అవే దృశ్యాలు.. అవే పోకడలు..! అన్నాడీఎంకే, తెరాస సభ్యుల ఆందోళనలు… దీంతో సభలో చర్చకు అనువైన వాతావరణం లేదని స్పీకర్ కు అనిపించడం, ఉదయం సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే 12 గంటల వరకూ వాయిదా పడింది..! ఆ తరువాత, సభ మళ్లీ ప్రారంభం కాగానే.. అవే రొటీన్ సీన్లు..! మళ్లీ అన్నాడీఎంకే, తెరాస ఎంపీలు గందరగోళం సృష్టించడం. స్పీకర్ పోడియం ముందు ప్లకార్డులు పట్టించుకుని తమ రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్లు వినిపించారు. దీంతో సభ సజావుగా సాగదు అని స్పీకర్ మళ్లీ రొటీన్ గా తెలుసుకున్నారు.
ఇంత గందరగోళం మధ్యలో కూడా.. టీడీపీ, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామనే ఒక రొటీన్ ప్రకటనను ఇవాళ్ల అనంతకుమార్ చేశారు. సభ్యులు ఆందోళన విరమించాలని, సభ కంట్రోల్ లోకి వస్తే అవిశ్వాసం గురించి మాట్లాడదామని అన్నారు. కానీ, రొటీన్ గా సభ కంట్రోల్ లోకి రాలేదు. దాంతో విలువైన సభా సమయం వృధా అయిపోతోందన్న రొటీన్ ఆందోళన భాజపా ఎంపీలు వ్యక్తం చేశారు. సభ ఆర్డర్ లో లేదు కాబట్టి… గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. రాజ్యసభలో కూడా ఇంతకంటే భిన్నమైన దృశ్యాలను చూడలేం..! అక్కడ కూడా ఇదే రొటీన్ తంతు. ఆ తరువాత, మరో రొటీన్ వ్యవహారం ఏంటంటే.. సభ బయట టీడీపీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడం. కేంద్రానికి దమ్మూ ధైర్యం ఉంటే చర్చకు రావాలంటూ టీడీపీ ఎంపీలు సవాల్ చేశారు. అవిశ్వాసంపై చర్చ జరిపే వరకూ తాము ప్రయత్నిస్తూనే ఉంటామన్నారు.
నాలుగో రోజు కూడా కేవలం వాయిదా కోసమే సమావేశాలను మొదలుపెట్టారు అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంది..! సభ ఆర్డర్ లో లేదన్న సాకునే చూపుతున్నారు. కానీ, దాన్ని ఆర్డర్ లో పెట్టాల్సిన బాధ్యత ఉన్నది వారికే అని మాత్రం తెలుసుకోవడం లేదు..! ఆ దిశగా ఒక్కటంటే ఒక్క ప్రయత్నమూ భాజపా నుంచి ఇంతవరకూ మొదలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. ఆంధ్రా సమస్యలంటే కేంద్రానికి ఉన్న నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ట ఇది..! ఇలా వాయిదాలు వేస్తూ పోవడం వల్ల ఆంధ్రాలో వ్యతిరేకతను వారే పెంచి పోషించుకుంటున్నారు అనేది అర్థమౌతోందో లేదో తెలీదు. నాలుగో రోజుకి అర్థమౌతున్నది ఏంటంటే… అవిశ్వాసం పెడితే మోడీ సాబ్ వైఫల్యాలను అందరూ కలిసి ఎండగట్టేస్తారన్న భయం వారిలో మొదలైనట్టుంది. అవిశ్వాస తీర్మానం చర్చకు పెడితే, కేవలం ఏపీ సమస్య మాత్రమే కాదు, నోట్ల రద్దు వైఫల్యం, జీఎస్టీ భారం, పన్నుల పెంపు, పెరుగుతున్న ధరలు.. వీటన్నింటిపైనా విరుచుకుపడే అవకాశం విపక్షాలకు వస్తుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదన్న ఆందోళన భాజపాకి మొదలైనట్టుగా కనిపిస్తోంది.