తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై… ప్రగతి భవన్ వర్గాలు… మీడియాకు రోజుకో సమాచారం ఇస్తూ.. గందరగోళానికి గురి చేస్తున్నాయి. రెండు రోజుల కిందట… పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా మంత్రివర్గ విస్తరణ జరపడానికి వీల్లేదని… అందుకే…ఫిబ్రవరి మొదటి వారంలో విస్తరణ జరుగుతుదని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ… పంచాయతీ ఎన్నికల కోడ్‌కి.. మంత్రివర్గ విస్తరణకు సంబధం ఏమిటో చాలా మందికి అర్థం కాలేదు. అడిగినా చెప్పేవారు ఉండరు. ప్రభుత్వం, అధికారులు ఏది చెబితే.. అదే కాబట్టి.. నిజమే కాబోలనుకున్నారు. కానీ ఆ తర్వాతి రోజే మాట మార్చి… తూచ్ అనే శారు. పంచాయతీ ఎన్నికల రూల్స్‌లో.. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, ప్రమాణస్వీకారాల లాంటి వాటి గురించి లేదని ప్రకటించారు. దీంతో మళ్లీ… అదిగో మంత్రి వర్గ విస్తరణ అంటూ చర్చలు ప్రారంభించారు.
మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ ఎమ్మెల్యేలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఫలితాలు వచ్చి ఇరవై రోజులు దాటింది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పర్యటనల తర్వాత విస్తరణ ఉంటుందని భావించారు. కానీ మంచి రోజులు లేవన్న కారణంతో విస్తరణ వాయిదా వేసుకున్నారు. సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఆ వెంటనే విస్తరణ ఉంటుందని సంకేతాలిచ్చారు. కానీ… మళ్లీ పంచాయతీ ఎన్నికల పేరుతో.. వాయిదా పడిందని సమాచారం బయటకు వచ్చింది. ఇదే కారణం అయితే.. నెలాఖరులో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానుంది. దాంతో మళ్లీ విస్తరణకు బ్రేక్ వేయడం ఖాయమవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఈ నెల 18న మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారని కొత్తగా ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సారి టీఆర్ఎస్ తరపున అత్యధిక మంది సీనియర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ కారణంతో పాటు .. సామాజికవర్గాల సమీకరణాలు కలసి వచ్చేలా కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అయితే కచ్చితంగా ఎప్పుడు విస్తరణ అన్నదానిపై మాత్రం లీకులే తప్ప..అధికారిక సమాచారం రావడం లేదు. కేసీఆర్ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ… టీఆర్ఎస్ ఉన్నత స్థాయి వర్గాల నుంచి మాత్రం రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.