సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ తనదైన ముద్ర వేశాడు. 90 శాతం హిట్లే. ఓ దశలో.. ఆర్పీ పేరు మారు మోగిపోయింది. ఆ తరవాత.. ఎందుకో నటనపై దృష్టి పెట్టాడు ఆర్పీ. అక్కడ్నుంచి తన గ్రాఫ్ పడిపోవడం మొదలెట్టింది. దర్శకుడిగా మారినా.. విజయాలు దక్కలేదు. దాదాపు అరడజను సినిమాలు తీశాడు. ఏదీ సంతృప్తినివ్వలేదు. కొన్నాళ్లుగా సంగీతానికి, దర్శకత్వానికీ దూరంగా ఉన్నారాయన. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్పై ఆశ పుట్టింది.
ఆర్పీ.. దర్శకుడిగా ఓ సినిమా మొదలెట్టారు. పేరు.. `కాఫీ విత్ కిల్లర్`. ఇదో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. నటన, దర్శకత్వం, సంగీతం, నిర్మాణం.. ఇలా అన్ని రకాల బాధ్యతల్నీ మళ్లీ తనపైనే వేసుకున్నాడు ఆర్పీ. షూటింగ్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేస్తార్ట. సంగీత దర్శకుడిగానూ ఇప్పుడు వడి వడిగా అడుగులు వేయడానికి సంసిద్ధమయ్యారు ఆర్పీ. ఓ వెబ్ సిరీస్ కి ఆర్పీ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచైనా ఆర్పీ ప్రయాణం ట్రాక్ లో పడుతుందేమో చూడాలి.