ఆర్పీ పట్నాయక్ సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు, దర్శకుడు కూడా. కొంతకాలం సంగీతం పక్కన పెట్టి, మెగాఫోన్ పట్టాడు. అయితే అక్కడ అనుకొన్నంత సక్సెస్ లభించలేదు. దాంతో… మళ్లీ సొంత గూటికి చేరి, స్వరాలు సమకూర్చే పనిలో బిజీ అయ్యాడు. తను సంగీతం అందించిన ‘అహింస’ త్వరలో విడుదల కానుంది. అయితే.. మెగాఫోన్ పూర్తిగా వదల్లేదని, కొత్త కథలు రాసుకొంటున్నానని చెప్పుకొచ్చాడు ఆర్పీ. తన దగ్గర ఓ పెద్ద కథ ఉందట. అది ఎన్నికల నేపథ్యంలో సాగుతుందని, అది గనుక బయటకు వస్తే… ఎలక్షన్ల తీరు పూర్తిగా మారిపోతుందని, అంత ప్రభావం చూపిస్తుందని, సరైన నిర్మాత కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు ఆర్పీ.
”రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. కానీ నాతో సినిమా తీసే ధైర్యం నిర్మాతలకు లేదు. ఎందుకంటే.. నా సినిమాలు కొన్ని సరిగా ఆడలేదు. సరైన నిర్మాతలు ఉంటే యేడాదికి దర్శకుడిగా నాలుగు సినిమాలు తీస్తా. అన్ని కథలు నా దగ్గర ఉన్నాయి. ఎలక్షన్ల తీరుపై ఓ కథ రాశాను. అది బయటకు వస్తే సంచనలం అవుతుంది. కానీ.. నిర్మాతలు నన్ను నమ్మాలి. ధైర్యం చేయాలి” అంటున్నాడు ఆర్పీ. మరి.. ఆర్పీని నమ్మి ధైర్యం చేసే నిర్మాత ఎవరైనా ఉన్నారా? అంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయగలరా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆర్పీ దర్శకత్వం వహించిన సినిమాల్లో `బ్రోకర్` బాగానే ఉంటుంది. కానీ ఆ సినిమా సైతం ఆర్దికంగా విజయం సాధించలేకపోయింది.