నిమ్మగడ్డ వ్యవహారంలో మరోసారి సుప్రీంకోర్టు అలా స్టే నిరాకరించగానే.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా మందుకు వచ్చి జగన్కు హితోక్తులు చెప్పడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 356 పరిస్థితిని తెచ్చుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించినది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు వస్తున్న సమయంలో.. కోర్టు తీర్పులను కూడా లెక్క చేయని పరిస్థితి ఏర్పడిన సందర్భంలో… రఘురామకృష్ణరాజు రాష్ట్రపతి పాలన ప్రస్తావన తీసుకు రావడం… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఏం చేసినా న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని..ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదన్న సంగతి గుర్తించుకోవాలని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశించినా.. ఏపీ సర్కార్కు.. నిమ్మగడ్డను మళ్లీ నియమించే ఆలోచన లేదని… వార్తలు వస్తున్న తరుణంలో.. రఘురామకృష్ణరాజు చేసిన హెచ్చరికలు.. వైసీపీలో సైతం కలకలం రేపుతున్నాయి.
చెప్పుడు మాటలు విని జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. చివరికి న్యాయవ్యవస్థను సైతం కించ పరుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తూ.. వారికి అండగా ఉంటామని.. పెద్దలే భరోసా ఇచ్చే పరిస్థితి ఉందని.. రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నైనా న్యాయవస్థను గౌరవించాలని ఎంపీ హితవు చెప్పారు. ” సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడానికి మీకేమైంది?, గవర్నర్ మాట వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించండి. అత్యున్నత స్థాయిలో గెలిచిన వైసీపీ.. అంతేస్థాయిలో ఉన్నతంగా ఆలోచించాలని నేరుగా సలహా ఇచ్చేశారు.
ఒక్క సుప్రీంకోర్టు తీర్పుపైనే కాదు.. పాలనా విషయం.. తనపై అనర్హతా వేటు కోసం చేస్తున్న ప్రయత్నాలపైనా ఎపీ మండిపడ్డారు. కరోనా విషయంలో సీఎం జగన్ సీరియస్గా లేకపోవడం వల్లే పరిస్థితి దిగజారిందన్నారు. ముఖ్యమంత్రే మాస్క్ పెట్టుకోకుండా.. ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. తనపై అనర్హతా వేటు వేసే విషయంలో… ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. మీ బొమ్మ పెట్టుకుని గెలిచినా ప్రశ్నించకూడదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల కంటే ముందు రఘరామకృష్ణరాజు… వైసీపీ అధినేత తీరుపై.. విమర్శలు చేయడం.. వైసీపీలోనూ కలకలం రేపింది. రాష్ట్రపతి పాలన హెచ్చరికలే చర్చనీయాంశం అవుతున్నాయి.