అంతర్వేది ఆలయం రధం బుగ్గిగా మారిన విషయంలో… మిగతా పార్టీల నేతల కన్నా..వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎక్కువగా స్పందింస్తున్నారు. రథాన్ని కావాలనే తగులబెట్టారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంతర్వేది ఘటన సంచలనం సృష్టించినా.. ఇంత వరకూ ఏం చర్యలూ తీసుకోలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రథాన్ని ఎవరు తగులబెట్టారో తేల్చాలని … రథం కాలిపోవడం కుట్రగానే అనిపిస్తోందన్నారు. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడానికి.. కొందరు వైసీపీ నేతలు పిచ్చిగా మాట్లాడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. రెండు దేవాలయాలకు కలిపి ఒక ఈవోని నియమించడం ఏమిటని.. హిందూ దేవాలయాలు అంటే లెక్కలేదా అని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి మతం గురించి అన్యాపదేశంగా అయినా సరే… రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. మీకు హిందూపురాణాలు తెలియవు.. అసలు మీ పాలసీ ఏంటి అని సూటిగానే ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక మతం మీద దాడి జరుగుతుంటే ఏం చేస్తున్నారు… మీ విధానం ఏంటో సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు ఆదివారం కూడా ఈ అంశంపై స్పందించారు. విచారణ జరిపించాలని కోరారు. అయితే రఘురామకృష్ణరాజుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. సీసీకెమెరాలు పనిచేయడం లేదని .. చర్యలు తీసుకోవాలని చెప్పిన వాళ్లు.. మీ మంత్రులకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారని .. దేవాదాయశాఖ అధికారులను విచారణ చేయమని చెప్పడమేంటని ఎంపీ ఆశ్చర్యపోయారు.
ప్రతీ రోజూ రచ్చ బండ పేరుతో ప్రెస్‌మీట్ పెడుతున్న రఘురామకృష్ణరాజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రోజుకో టాపిక్‌పై ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. కోర్టు తీర్పులు వస్తే వాటి మీద లేకపోతే..ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో.. వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. కొంత మంది బీజేపీ నేతలు… వైసీపీకి అనుకూలంగా ఉంటున్నారు కానీ.. సొంత ఎంపీ మాత్రం… పదే పదే విమర్శలు చేస్తూ.. రచ్చ చేస్తున్నారు.