ఓ సినిమా ఊరకే హిట్లయిపోదు. ఓ సినిమాని మనసులోకి ప్రేక్షకుడు తీసుకొన్నాడంటే.. అందులో విషయం ఉండి తీరాల్సిందే. ఓ సినిమాకు బాక్సాఫీసు పట్టం కట్టిందంటే – కనీ వినీ ఎరుగని విజయాన్ని అందించిందంటే – ఆ చిత్రబృందం అద్భుతమేదో చేయాల్సిందే. అలా ఓ దర్శకుడు చేసిన అద్భుతం.. RRR.
రాజమౌళి బ్రిలియన్స్ని నిలువుటద్దం.. ఆర్.ఆర్.ఆర్. ఇందులో అనుమానం ఏం లేదు. బాహుబలి తరవాత రాజమౌళి ఏం చేయగలడు? అంతకు మించిన అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేయగలడు? అని సగటు సినిమా అభిమాని ఆలోచిస్తున్న తరుణంలో ఇద్దరు హీరోల్ని ఎంచుకొని మల్టీస్టారర్‌కు ముహూర్తం పెట్టాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచన దగ్గరే రాజమౌళి సక్సెస్ కొట్టేశాడు. అది ఎలాంటి సినిమా.. ఫక్తు కమర్షియల్ సినిమా కాదు. దానికో చారిత్రక ప్రాధాన్యం ఉంది. తెలంగాణలోని కొమరం భీమ్, ఆంధ్రాలో అల్లూరి సీతారామ రాజుని కలిస్తే ఉలా ఉంటుందన్న ఊహాత్మక ఆలోచన.. ఈ కాంబినేషన్‌కి మరింత బలాన్ని ఇచ్చింది. ఆ తరవాత.. రాజమౌళి విజన్ పరుగులు పెట్టింది. ఎన్టీఆర్, చరణ్ అభిమానులకే కాదు, సగటు సినీ ప్రేక్షకుడికీ నచ్చేలా, తనదైన బాణీలో ఆర్.ఆర్.ఆర్ ని తెరపై ఆవిష్కరించాడు. ఓ గొప్ప విజయాన్ని అందుకొన్నాడు. ఆస్కార్ వరకూ ఈ సినిమాని తీసుకెళ్లి, ఆ అవార్డుని కూడా భారతదేశానికి తీసుకొచ్చాడు. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తెరపై ప్రేక్షకుడు చూసిన ప్రతీ విజువల్ వెనుక, `వావ్` ఫ్యాక్టర్ వెనుక… ఎంతో కష్టం దాగుంది. రాజమౌళి ఆలోచనకు, ఇద్దరు హీరోల స్వేదం, సాంకేతిక నిపుణుల సృజన తోడయ్యాయి. అందుకే ఇంత గొప్ప సినిమా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా వెనుక ఉన్న విశేషాల్ని పంచుకొంటూ… RRR బిహైండ్ & బియాండ్ అనే ఓ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది.
ఆర్.ఆర్.ఆర్ లో ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనైన ప్రతీ సన్నివేశం తాలుకూ విశిష్టతనీ, అందుకోసం చిత్రబృందం పడిన కష్టాన్నీ సవివరంగా వివరిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రమా రాజమౌళి, సింధిల్, ప్రేమ్ రక్షిత్, కమల్ కణ్ణన్… వీళ్లంతా తమ అనుభవాల్ని జ్ఞాపకాల్ని పంచుకొన్నారు. ఒకొక్కరి వివరణ వింటుంటే, ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఓ సన్నివేశం బాగా రావడానికి ఇంత తపన పడ్డారో అనేది అర్ధం అవుతుంది. మరీ ముఖ్యంగా సెట్లో చరణ్, ఎన్టీఆర్ బాండింగ్, రాజమౌళి ప్యాషన్, హీరోలతో రాజమౌళికి ఉన్న అనుబంధం.. ఇవన్నీ అందంగా, ఆహ్లాదకరంగా ఆవిష్కరించారు.
”ఓ మంచి కథ ఎక్కడైనా నిలబడుతుంది. దాన్ని అందంగా, అర్థమయ్యేలా చెప్పడమే దర్శకుడి పని” అనే రాజమౌళి మాటలతో ఈ డాక్యుమెంటరీ మొదలైంది. రాజమౌళి విజన్‌కీ, సక్సెస్ సీక్రెట్ కీ ఈ వ్యాఖ్యలు అద్దం పడతాయి. ఆ తరవాత.. ఐకానిక్ సీన్లు, వాటి కోసం చిత్రబృందం చేసిన బ్యాక్ గ్రౌండ్ వర్క్.. వరుసగా కళ్లముందు కదలాడతాయి. సినిమా ఆర్డర్‌లోనే.. ఒకొక్క సీన్ కోసం వివరించుకొంటూ వెళ్లింది చిత్రబృందం.
ఆర్.ఆర్.ఆర్ లో అబ్బుర పరిచే సన్నివేశాల్లో రామ్ చరణ్ – వేలాది మందితో ఫైట్ చేసే సీన్ ఒకటి. దాన్ని ఎలా డిజైన్ చేశారో, ఎలా తెరపైకి తీసుకొచ్చారో కళ్లకు కట్టారు. జక్కన్న ‘నేను తీయగలనా, లేదా’ అని భయపడిన సన్నివేశం ఇదేనట. అయితే.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకొన్నది అనుకొన్నట్టు ఆవిష్కరించగలిగాడు. కురుక్షేత్రంలో అభిమన్యుడి యుద్ధాన్ని ఈ ఫైట్ కోసం రిఫరెన్స్ గా తీసుకొన్నాడు ఫైట్ మాస్టర్. ఈ సీన్లో దాదాపు 10వేలమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారన్న భ్రమ కల్పించారు. కానీ అక్కడ ఉన్నది కేవలం 800మంది మాత్రమే. కట్ చెప్పినప్పుడు జనం గుంపులో చరణ్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలిసేది కాదట. కట్ అనగానే.. ఆ 800 జూనియర్ ఆర్టిస్టులకు హీరో ఎక్కడ ఉన్నాడో తెలిసేలా.. ఓ తెల్ల జెండా ఊపేవార్ట.
ఈ ఫైట్ లో.. ఓ ఐకానిక్ షాట్ ఉంటుంది. రామ్ చరణ్ కళ్లలో క్లోజప్ పెట్టినప్పుడు జన సమూహం చరణ్ కళ్లల్లో కనిపిస్తుంది. నిజానికి అది సీజీ షాట్ అని అంతా అనుకొన్నారు. కానీ అది లైవ్ షాట్. అదెలా తీశారో సింధిల్ ఈ డాక్యుమెంటరీలో వివరించాడు.
ఎన్టీఆర్ ఎంట్రీ, పులితో ఫైట్.. ఇవన్నీ గూజ్‌బమ్ మూమెంట్స్. ఈ ఫైట్ వెనుక కూడా చాలా కష్టం దాగుంది. సీజీల్లో పులిని తీర్చిదిద్దడం ఇప్పుడున్న టెక్నాలజీలో ఈజీనే. కానీ దాంతో ఫైట్ చేస్తున్నట్టు మ్యాచ్ చేయడం చాలా కష్టం. పులి వేగాన్ని హీరో ఫైట్ చేస్తున్నప్పుడు మ్యాచ్ చేయాలి. ఎక్కడ సింక్ కుదరకపోయినా మళ్లీ రీ టేక్ కి వెళ్లిపోవాలి. ఎదురుగా పులి ఉండదు. ఊహించుకొని నటించాలి. దాంతో పాటు.. ఆ పులి వేగాన్ని అందుకోవాలి. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్నాడు కాబట్టే ఈ ఫైట్ అంత సహజంగా వచ్చింది. ఈ ఫైట్ లో ఎన్టీఆర్ తో పులి ఛేజ్ ఒకటి ఉంది. ఎన్టీఆర్ పరుగెడుతున్నప్పుడు ఆ వేగాన్ని అందుకోవడం కెమెరామెన్లకు కూడా సాధ్యం కాలేదట. ఇవన్నీ రాజమౌళి మాటల్లో విని ఆనందించాల్సిందే.
ఎన్టీఆర్, చరణ్‌లు తొలిసారి కలిసే యాక్షన్ సీక్వెన్స్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసే ఆ సీన్ ఎంత బాగుండాలి? సాధారణంగా తన ఒక హీరో ఉంటేనే, తన ఎంట్రీని అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తాడు జక్కన్న. అలాంటిది ఇద్దరు హీరోలు కలిసిన సందర్భాన్ని ఇంకెలా డిజైన్ చేయాలి. ఓవైపు చరణ్, ఇంకోవైపు ఎన్టీఆర్.. ఇద్దరి హీరోల ఇమేజ్‌లకు తగ్గకుండా, అభిమానులు నొచ్చుకోకుండా ఈ ఫైట్ కంపోజ్ చేయాలి. అదే చేశాడు కూడా. ఎన్టీఆర్, చరణ్ గాల్లో గింగిరాలు తిరుగుతూ.. ఒకరి చేయి మరొకరు పట్టుకోవడం… హైటెట్ షాట్స్ లో ఒకటి. ఆ షాట్ కోసం ఎన్టీఆర్, చరణ్ పడిన కష్టం చూస్తే `వామ్మో` అనిపిస్తుంది. అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా చాలా కష్టపడి తీశారు. 20 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్ లో, ఊపిరి ఆడని పరిస్థితుల్లో అలాంటి షాట్ తీయడం రిస్కే. ఈ టోటల్ యాక్షన్ సీన్‌ని సీజీ, మినేచర్, లైవ్ లొకేషన్స్.. ఈ మూడు కాంబినేషన్లలో తీర్చిదిద్దారు.
ఈ ఫైట్ సీక్వెన్స్‌లో రాజమౌళి ఓ మెటాఫర్ చెప్పడానికి ప్రయత్నించాడు. హీరోలు కాపాడాలి అనుకొన్న ఆ పిల్లాడు ఈ దేశానికి ప్రతీక. రాజు – అక్తర్ అంటూ చరణ్, ఎన్టీఆర్‌లు తమని తాము పరిచయం చేసుకోవడం ముస్లీం మతాలకు మెటాఫర్. వాళ్లిద్దరూ కలిస్తే ఈ దేశం కోసం దూరమైనా వెళ్తారు, ఎంత త్యాగమైనా చేస్తారు అని చెప్పడమే రాజమౌళి ఉద్దేశం.
ఇక నాటు నాటు పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాటని పాటలా కాకుండా.. ఓ కథలా చెప్పడానికి ప్రయత్నించింది చిత్రబృందం. ఈ డాన్స్ ఓ ఫైట్ లా ఉండాలి, అందులోనూ ఓ కథ చెప్పాలి – అని ముందే డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కి ఓ ఛాలెంజ్ విసిరారు రాజమౌళి. ఇక అక్కడ్నుంచి కసరత్తులు మొదలయ్యాయి. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మంచి డాన్సర్లే, కాకపోతే ఎవరి స్టైల్ వాళ్లది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కేమిటంటే.. ఇద్దరూ ఒకే సింక్ లో డాన్స్ చేయాలి. ఆ సింక్ పట్టుకోవడమే కష్టం. అందుకోసం హైదరాబాద్ లో 15 రోజులు రిహార్సల్స్ చేశారు. ఉక్రేయిన్ లో మరో 7 రోజులు చేశారు. షూటింగ్ 12 రోజుల్లో ఫినిష్ చేశారు. ఇక ఐకానిక్ డాన్స్ స్టెప్ కోసం చేసిన రిహార్సల్స్, రీషూట్లు చెప్పతరం కాదు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సరో తేల్చుకోలేక ప్రేక్షకులే తలలు పట్టుకోవాలన్న రాజమౌళి ఆలోచన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అందుకే ఈ పాట చరిత్రలో మిగిలిపోయింది.
ఇక ధియేటర్లో పూనకాలు తెప్పించిన ఇంట్రవెల్ ఎపిసోడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మీనియేచర్స్, సెట్ వర్క్, రిహార్సల్స్, ఆర్ట్, ఫైట్ మాస్టర్ల కో ఆర్డినేషన్, విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు, ఎన్టీఆర్, చరణ్‌ల హార్డ్ వర్క్.. ఇలా అనేక విభాగాల సమ్మేళనం ఈ ఎపిసోడ్. దాదాపు 60 రాత్రులు ఈ ఫైట్ కోసం కేటాయించారు. 1500 జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకొన్నారు. కానీ సరిగ్గా అప్పుడే కోవిడ్ అలజడి మొదలైంది. షూటింగ్ ఆగిపోయింది. కొంత కాలం తరవాత మళ్లీ పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ పరిమితుల మధ్య షూటింగ్ చేయాల్సివచ్చింది. 1500 మంది కాస్త సగం అయ్యారు. 60 రాత్రులు షూటింగ్ 30 రాత్రులకు కుదించారు. మధ్యలో మళ్లీ సెకండ్ వేవ్ మొదలైంది. షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకూ ఎదురు చూపులే. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ మొదలు. ఇలా.. అనేక ఒడిదుడుకుల మధ్య చేసిన ఈ ఎపిసోడ్.. ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా వచ్చింది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రవెల్ సీక్వెన్స్ గా ఇండియన్ హిస్టరీలో మిగిలిపోయింది. దాని వెనుక కష్టం ఏమిటో తెలియాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే.
ఇవే కాదు. ఆర్.ఆర్.ఆర్‌లో ప్రతీ ఎపిసోడ్ వెనుక ఉన్న కథని కష్టాన్నీ విడమర్చి చెప్పుకొంటూ వెళ్లారు. ఇదంతా చూస్తే ఆర్.ఆర్.ఆర్‌పై మరింత ప్రేమ పెరగడం ఖాయం. ఈ డాక్యుమెంటరీ చూశాక.. మళ్లీ ఆర్.ఆర్.ఆర్ చూడాలనిపిస్తుంది. ఈసారి ఆర్.ఆర్.ఆర్ మరింత కొత్తగా, గొప్పగా కనిపిస్తుంది. చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు ఇదో కానుక. రాజమౌళిని ఆరాధించే ఈతరం దర్శకులకు ఇదో పాఠ్యగ్రంధం. ఏ విజయం సులభంగా రాదని, దాని వెనుక ఎంతో కష్టం, ఎన్నో నిద్ర లేని రాత్రుల త్యాగం ఉంటాయని ఈ డాక్యుమెంటరీ చూస్తే అర్థం అవుతుంది. ఆర్.ఆర్.ఆర్ని ఇంకాస్త క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుంది.