విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ.. పోలీసులు అరెస్ట్ చేసిన నలంద కిషోర్ అనే వృద్ధుడు చనిపోయాడు. ఆయన గంటా శ్రీనివాసరావు అనుచరుడు. విశాఖ టీడీపీ సానుభూతిపరుడిగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం.. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్‌ల పేర్లు లేకుండా.. వారికి సంబంధించిన పోస్టులంటూ.. కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అలాంటివాటిలో ఒకటి నలంద కిషోర్ షేర్ చేశారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మొదట విశాఖ పోలీస్‌స్టేషన్‌కు ఆ తర్వాత కర్నూలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ అరెస్ట్ పై గంటా శ్రీనివాసరావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలులో అత్యధిక కరోనా కేసులు అత్యధికంగా ఉన్న సమయంలో ఆయనను అక్కడకు తీసుకెళ్లి బెయిల్ పై విడిచిపెట్టారని.. అక్కడ అయనకు కరోనా సోకిందని.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా పోస్టులకే.. ఆరోగ్యం బాగోలేకపోయినా అరెస్ట్ చేసి దారుణంగా వ్యవహరించారని.. పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఓ వ్యక్తి మరణానికి పోలీసులే కారణం అని మండిపడుతున్నారు. ప్రభుత్వమే ఈ మరణానికి బాధ్యత వహించాలని టీడీపీ నేతలు అంటున్నారు. చనిపోయిన నలంద కిషోర్ .. ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా పరిచయస్తుడు కావడంతో ఆయన కూడా స్పందించారు. పోలీసులు చేసిన హత్యగానే భావించాలన్నారు. కిషోర్ మృతి తనను బాధించిందని వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి నైతిక బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ సర్కార్.. చిన్నా.. పెద్దా లేకుండా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందర్నీ టార్గెట్ చేస్తోంది. గతంలో గుంటూరు జిల్లాలో రంగనాయకమ్మ అనే వృద్ధురాలిపైనా కేసు పెట్టారు. పోలీసులు.. హైకోర్టు.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కనీసం పట్టించుకోలేదు కానీ.. వైసీపీ నేతలపై.. వ్యతిరేక పోస్టులు పెడితే మాత్రం.. విరుచుకుపడుతున్నారు. చెన్నాలో కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో తమిళ మీడియా చెప్పిన అంశాలను పోస్టులు పెడితే.. కొంత మందిని అరెస్ట్ చేసి.. పోలీసులు చితకబాదారు. కానీ ఆ నగదు గురించి మాత్రం.. కనీసం విచారణ చేపట్టలేదు. అలాగే.. అనేక అంశాల్లో పోలీసులు… వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. తాజాగా.. కిషోర్ మృతికి చట్టాలను అధిగమించి వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు… తీరే కారణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.