తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి వెంకట్రావు హడావుడి చేయడంతో.. దీని వెనుక ఏదో మతలబు ఉందన్న చర్చ నడుస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఈ విషయంలో నేరుగా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కావాలంటే… జగన్మోహన్ రెడ్డికి చర్చి కట్టుకోవచ్చునని.. గుడి పేరుతో హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దని హెచ్చరించారు.
ఓ వైపు అయోధ్య రామాలయం శంకుస్థాపన ప్రత్యక్ష ప్రసారాన్ని ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వలేదు. దీన్ని కూడా రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వైసీపీ అధినాయకత్వంతో విబేధించి… బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న రఘురామకృష్ణరాజు.. హిందూత్వ అజెండాను సమర్థిస్తున్నారు. అయోధ్య రామాలయ శంకుస్థాపనకు ఆయన ముందుగా మద్దతు తెలిపారు. విరాళం కూడా ఇచ్చారు. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టడం అనే అంశంపై విమర్శలు ప్రారంభించారు. దీనికి హిందువుల మనోభావాలనే అంశాన్ని జోడించడం… ఆసక్తికరంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు. ఆయన పక్కా క్రిస్టియన్. అందులో ఎలాంటి సందేహం లేదు . అయినప్పటికీ.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఏ ఉద్దేశంతో ఆయన గుడి కడుతున్నారో కానీ ప్రజల్లో విస్మయం వ్యక్తముతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజుకు కనీసం వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సౌకర్యాలు సరిగ్గా లేవనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో..ప్రజలను కరోనా నుంచి కాపాడారంటూ..జగన్ ను కీర్తిస్తూ గుడి కట్టేస్తున్నారు వెంకట్రావు. ఇదేం పద్దతన్న విమర్శలు వస్తున్నా వెనుకడుగు వేయడం లేదు.