రాజమౌళి ఏం చేసినా భారీగానే ఉంటుందన్న సంగతి RRR గ్లిమ్స్ తో మరోసారి రుజువైంది. రాజమౌళి నుంచి వస్తున్న ఈ మల్టీస్టారర్ పై చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. తాజా గ్లిమ్స్ తో… అవి మరింతగా పెరిగాయి. RRR ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ గ్లిమ్స్ని బయటకు వదిలారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ సింహాల్లా.. పోరాడుతున్న దృశ్యాలు, వేలాది మంది బ్రిటీష్ సైనికులు, గొరెల్లా యుద్ధ సన్నివేశాలతో… 45 సెకన్ల వీడియో కాస్త విజువల్ ట్రీట్ గా మారిపోయింది. ఈ 45 సెకన్లలోనే రాజమౌళి ఇంత విధ్వంసం చూపించాడంటే.. ఇక రెండున్నర గంటల్లో ఎంత చూపిస్తాడో అర్థమవుతోంది. రాజమౌళి షార్ప్ కట్లూ, దానికి కీరవాణి ఇచ్చిన ఆర్.ఆర్ … ఇవన్నీ ఈ టీజర్ ని అంతర్జాతీయ స్థాయిలో… ఆవిష్కరించాయి. ఎన్టీఆర్, రామ్చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్.. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ తెరపై చూపించాడు రాజమౌళి. దాంతోపాటుగా ఓ పులి కూడా. బాహుబలి తరవాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇది. దానికి తగ్గట్టే.. ఆ మాటకొస్తే దాన్ని మించి RRR ఉండబోతోందన్న సంకేతాల్ని… ఈ చిన్న గ్లిమ్స్ తో పంపినట్టైంది.