అరెస్ట్ చేయడానికి ముందు రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే అది ఆయనను అరెస్ట్ చేస్తారనో.. చేయకుండా చూడాలనో కాదు.. ఏపీ ప్రభుత్వం అమూల్ సంస్థకు.. మొత్తం ఏపీ డెయిరీ ఆస్తులు ధారదత్తం చేయాలనుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పిటిషన్ వేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదని పిటిషన్లోనే అనేక అంశాలను రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, సంస్థలు, ఉద్యోగులను అమూల్ వ్యాపార విషయంలో వినియోగించకుండా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.
ప్రభుత్వ ఆస్తులు.. అమూల్‌కు బదలాయించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో పారదర్శకత లేదని.. టెండర్లు పిలవకుండా ఓ ఏజెన్సీని ఎంపిక చేసుకొని వందల కోట్ల ఆస్తులను లీజుకు ఇవ్వడం అయాచితంగా లబ్ధి చేకూర్చడమేనని రఘురామ స్పష్టం చేశారు. డెయిరీ ఆస్తులను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే పబ్లిక్ ఏజెన్సీ అయిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్టు కు ఇవ్వొచ్చని.. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఖర్చులతో పాల సేకరణ, మార్కెటింగ్ చేసేందుకు అమూల్‌తో ఎంవోయూ చేసుకోవడం.. తప్పిదమన్నారు. అంటే ప్రభుత్వ వనరులతో అమూల్ లబ్ది పొందుతుందని రఘురామ పిటిషన్లో గుర్తు చేశారు.
అసలు లీజు విధివిధానాలేమిటో కూడా చెప్పలేదని రఘురామకృష్ణరాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ సోమవారం జరగనుంది. సాధారణంగా ప్రభుత్వ ఆస్తులు ఇష్టానుసారం సమర్పించడానికి అవకాశం లేదు. ఏదైనా టెండర్ల ద్వారా చేయాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండా అమూల్‌కు కట్టబెట్టేశారు. ఈ నిర్ణయం కోర్టుల్లో నిలబడదన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు.. ఆ కోర్టు దృష్టికి రఘురామకృష్ణరాజే తీసుకెళ్లారు. ఈ పిటిషన్ వేసిన రోజునే.. ఆయనను అరెస్ట్ చేయడం.. ఈ పిటిషన్‌పై ఆసక్తిని మరింత పెంచింది.