ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏపీ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోందని నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశారు. అదీ కూడా ఆషామాషీగా చేయలేదు. అన్ని లెక్కల వివరాలను చాలా స్పష్టంగా తెలుసుకుని.. ఎంత అప్పులు చేయాలి.. ఎంత చేస్తున్నారు… వంటి అంశాలన్నింటినీ.. లెక్కలు చెప్పి మరీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ లేఖ… ఏపీ ఆర్థిక శాఖలోనే కాదు.. ఢిల్లీలోనూ కలకలం రేపుతోంది.
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ.. ఏపీ సర్కార్ అప్పులు తెస్తోందని.. ఇందు కోసం.. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేషన్‌కు బదిలీ చేసి తాకట్టు పెడుతోందని ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెలవప్మెంట్ కార్పొరేషన్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్ల రుణాలు చేసిందని.. ఉచిత పథకాలకు మరో 3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదిస్తోందని గుర్తు చేశారు. పరిమితికి మించి చేసిన అప్పుల కారణంగా వచ్చే ఏడాది నుంచి 35 వేల కోట్లు కేవలం వడ్డీ గా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని లేఖలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలకు సగటున 9,226 కోట్ల అప్పులు చేసిందని విచక్షణరహితంగా చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడితప్పిందని తక్షణం జోక్యం చేసుకోవాలని రఘఉరామ ప్రధానని కోరారు.
కేంద్రంతో వైసీపీకి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. పెద్దగా పట్టించుకోవడం లేదు. అదే సమయంలో.. రుణాలతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన లోటు నిధులు.. ఇతర విషయాల్లో కేంద్రం బాగానే సహకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చెందిన నిధులను దారి మళ్లించినా పెద్దగా పట్టించుకోవడం లేదు. అన్నీ తెలిసినా… రఘురామకృష్ణరాజు.. కేంద్రానికిలేఖ రాశారు. ఒక వేళ.. ఆ లేఖను ప్రధాని పరిశీలించాలని ఆర్బీఐకో.. ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకో పంపితో.. వారు వివరాలు సేకరిస్తారు. అప్పుడు.. కొంత అలజడి రేగడం ఖాయమని చెబుతున్నారు.