ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతీ రోజూ రచ్చబండ పేరుతో ప్రెస్‌మీట్ పెట్టి రచ్చ చేస్తున్న రఘురామకృష్ణరాజు .. వైసీపీ ఎంపీగా మాత్రం సీరియస్‌గా పని చేస్తున్నారు. ఆయన తన పార్టీ కోసం.. ప్రజల తరపున పోరాడేందుకు ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా వదులుకోవాలనుకోవడం లేదు. ఈ సారి ఆ అంశంపై నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నందున.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను డిమాండ్ చేయడానికి.., పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలను ఖరారు చేసుకోవడానికి వెంటనే.. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖ రాశారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు.. ప్రతీ పార్టీ .. ఎంపీలతో సమావేశం నిర్వహిస్తుంది. పార్లమెంటరీ పార్టీ భేటీని నిర్వహించి.. ఎజెండాను ఖరారు చేసుకుంటుంది. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా.., పార్లమెంట్లో తమ రాష్ట్ర సమస్యల గళం వినిపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో వైసీపీ కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించింది. కారణం ఏమిటో కానీ.. ఈ సారి మాత్రం.. అలాంటి సమావేశాలు నిర్వహించలేదు. కరోనా కారణంగా నేరుగా సమావేశం నిర్వహించకపోయినా… ఆన్లైన్లో వర్చువల్‌గా అయినా సమావేశం నిర్వహించాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు. ఒక వేళ.. సమావేశం నిర్వహిస్తే.. తన వాదన వినిపించడానికి .. తన ఆలోచనలను వివరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొన్ని అంశాలు కేంద్రం దృష్టికి రాలేదని… ఇందుకు అధికారుల అలసత్వమే కారణమని రఘురామకృష్ణరాజు లేఖలో చెప్పుకొచ్చారు. ఏ అంశాలను లేవనెత్తాలి అనే అంశంపై ముందుగానే నోట్‌ను అందజేయాలన్నారు. సమావేశాలకు ముందు గతంలో సీఎంలు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని గుర్తుచేశారు. అయితే.. ఒక వేళ సీఎం జగన్ సమావేశం నిర్వహించినా రఘురామకృష్ణరాజుకు మాత్రం ఆహ్వానం అందే అవకాశం లేదని వైసీపీలోనే చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయం ఆర్ఆర్ఆర్ కి తెలియకేం కాదు. కానీ.. ఆయన వైసీపీ నాయకత్వం లోపాలను దనదైన శైలిలో ఎత్తి చూపుతున్నారని అనుకోవాలి.