రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం తెరవెనుక సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో త్రివిక్రమ్ సినిమా విడుదల కాగానే ఎన్టీఆర్ నవంబర్ నుంచి ఈ సినిమా సెట్ మీదకు వస్తారని ఇంతకు ముందే వార్తలు వచ్చాయి. అలాగే బోయపాటి తో చేస్తున్న సినిమాను ఫినిష్ చేసి, డిసెంబర్ నుంచి చరణ్ వస్తాడని కూడా వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ప్లానింగ్ ఓ నెల వెనక్కు జరిగిందన్నది. అనుకున్నట్లు నవంబర్ నుంచి కాకుండా డిసెంబర్ నుంచి ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనికి అసలు కారణం, ఇంకా స్క్రిప్ట్ లాక్ కాకపోవడమే. స్టిల్ ఇప్పటికీ రాజమౌళి అండ్ టీమ్ స్క్రిప్ట్ డిస్కషన్లు చేస్తున్నారు. ఈ డిస్కషన్ల ఇప్పట్లో ముగిసే అవకాశం తక్కువ.
అందువల్ల స్క్రిప్ట్ లాక్ అయితే తప్ప పూర్తిగా స్టోరీ బోర్డ్ తయారుకాదు. ఈ సినిమాకు కూడా గ్రాఫిక్స్ వర్క్ దిట్టంగానే వుంటుంది. ఎందుకంటే బ్రిటిష్ కథాకాలం ఎంతో కొంత వుంటుందని టాక్ వినిపిస్తోంది. గుర్రాల పరుగులు, బైకుల పరుగులు లాంటి వ్యవహారాలు చాలా వుంటాయట. సో, స్టోరీ బోర్డు రెడీ కావాలి. అంతకు ముందు స్క్రిప్ట్ లాక్ కావాలి. ఇద్దరు హీరోలు రెడీ కావాలి.
అన్నీ దృష్టిలో పెట్టుకుని, డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది.