రాజమౌళి మల్టీస్టారర్… ప్రస్తుతం చిత్రసీమని ఊరిస్తున్న సినిమా. రికార్డుల్ని బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్న రాజమౌళి ఈ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ రాజమౌళి చక చక పూర్తి చేస్తున్నారు. షూటింగ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. నవంబరు 18న షూటింగ్ మొదలవుతుందని ఈమధ్యే ఓ వార్త అందింది. చిత్రబృందం కూడా అదే రోజు షూటింగ్ మొదలెట్టాలనుకుంది. కానీ.. ఇప్పుడు రాజమౌళి ఆలోచన మారింది. అనుకున్న సమయానికంటే ముందే ఈ సినిమాని ప్రారంభించాలనుకుంటున్నారు. నవంబరు తొలి వారంలోనే… ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తారని సమాచారం. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుంది. వాళ్లిద్దరు కాక… ఓ విదేశీ కథానాయిక కూడా ఇందులో నటిస్తుందని తెలుస్తోంది. అంటే.. కథానాయికలు ముగ్గురన్నమాట. ప్రస్తుతం వాళ్ల కోసమే అన్వేషణ జరుగుతోంది. తొలి షెడ్యూల్లో హీరోయిన్లతో పనిలేదట. కేవలం ఎన్టీఆర్, చరణ్‌లతో సన్నివేశాలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ తరవాతే.. హీరోయిన్లు రంగంలోకి దిగుతారు. అందుకే… హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎలాంటి కంగారు పడడం లేదు. రెండో షెడ్యూల్‌కి ముందు కథానాయికల్ని ఎంపిక చేసి, అధికారికంగా ప్రకటిస్తారు.