వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రూటు మార్చారు. ఇప్పటి వరకూ పార్టీ అవకతవకల గురించి మాట్లాడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు.. మరింత ముందుకెళ్లారు. వైసీపీ పథకాలు.. హామీలు.. అమల్లోని లోపాలపై గురి పెట్టారు. మొదటి సారి.. వృద్ధులను మోసం చేశారంటూ.. ఓ లేఖను సంధించారు. నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాసి.. తనకు ఇక మొహమాటలు లేవని చెప్పకనే చెబుతున్నారు. రఘురామకృష్ణంరాజు టార్గెట్ చేసిన పథకం… వృద్ధాప్య పించన్లు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని.. 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారని .. 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని అందులో ఉందన్నారు.
కానీ దాన్ని అమలు చేస్తోందని మాత్రం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అని గుర్తు చేశారు. దీనివల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారన్నారు. లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఏడాది పెంచుతామన్న రూ.250 పెన్షన్ కానుకను.. వైఎస్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణరాజు లేఖలో కోరారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. నిరుద్యోగ భృతి సహా.. ఇతర పథకాలను.. చంద్రబాబు ప్రారంభం నుంచి అమలు చేయలేదని జగన్ ఆరోపించేవారు.
ఆ లెక్కలు చెప్పి.. యువతకు రూ. వేల రూపాయలు బాకీ ఉన్నారని చెప్పేవారు. ఇప్పుడు అదే తరహాలో రఘురామకృష్ణంరాజు.. తన పార్టీ లైన్లోనే … లేఖలు రాస్తున్నారు. ఇచ్చిన జీవోకు.. అమలు చేసిన కాలానికి మధ్య ఏడు నెలల గ్యాప్ ఉండటంతో.. ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వైసీపీ నాయకత్వంపై పడింది. వైసీపీ పథకాలన్నీ డొల్లగా ఉన్నాయని.. ఎవరికీ పెద్దగా లబ్ది చేకూరడం లేదని విమర్శలు వస్తున్న సమయంలో.. సొంత పార్టీ ఎంపీనే ఆ విషయాన్ని బయట పెట్టడానికి రంగంలోకి దిగడం వైసీపీ నేతలకు మింగుడు పడని అంశమే.