నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ లభించింది. వినాయకచవితి రోజు..ఆయన ఢిల్లీలోని తన ఇంట్లో పూజ చేసి.. సెక్యూరిటీ సిబ్బందితో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టారు. సినిమా ఫోటో షూట్లా ఆ ఫోటో ఉండటంతో వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తనకు వై కేటగిరి భద్రత కల్పించిందని రఘఉరామకృష్ణరాజు ప్రకటించారు. ఇప్పుడు ఆయన తనకు భద్రతగా వచ్చిన సెక్యూరిటీని ఇలా ప్రత్యేకంగా బయట పెట్టారు.
వై కేటగిరి సెక్యూరిటీ కింద.. పదకొండు మంది కేంద్ర బలగాలతో రక్షణ ఉంటుంది. ఒకరు లేదా ఇద్దరు కమాండోస్ వీరిలో ఉంటారు. రాష్ట్ర పర్యటనకు వస్తే.. వై కేటగిరి ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్ర బలగాలు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. వై కేటగిరి కింద పది మంది రాష్ట్ర పోలీసులు ఆయనకు భద్రత కల్పించే అవకాశం ఉంది. అధికార పార్టీకి చెందిన ఎంపీ అయిన రఘురామకృష్ణరాజు.. తనకు తన పార్టీ నేతల నుంచే ప్రాణహాని ఉందని.. కేంద్ర బలగాల రక్షణ కావాలని పోరాడి సాధించుకున్నారు.
నర్సాపురంలో పర్యటిస్తే దాడులు చేస్తామని పలువురు వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ కారణంతో.. తన భద్రతపై ఆందోళనతో ఉన్నారు. గతంలో.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా.. వైసీపీ నేతలు అదే తరహాలో దాడులు చేస్తామన్నట్లుగా ప్రకటనలు చేశారు. దాంతో ఆయన కూడా.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. తనకు కేంద్ర భద్రతా బలగాలతో రక్షణ కావాలని కోరారు. కేంద్ర హోంశాఖ ఆ మేరకు ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఇప్పుడు సొంత అధికార పార్టీకి చెందిన ఎంపీకి కేంద్రం భద్రత కల్పించింది. తాను అమరావతిలో పర్యటించాలనుకుంటున్నానని అనుమతి ఇవ్వాలని రఘురామకృష్ణంరాజు ఇప్పటికే ఏపీ డీజీపీకి లేఖ రాశారు.