రాజమౌళి అంటేనే మిస్టర్ పర్ఫెక్షనిస్టు. అందుకే ఆయన సినిమాలు ఆలస్యంగా వస్తుంటాయి. చెప్పిన సమయానికి టీజరూ, ట్రైలరూ, ఫస్ట్ లుక్కులు లాంటివి రావడం కూడా అరుదుగానే సంభవిస్తుంటాయి. రాజమౌళి తో సినిమా చేస్తున్నారంటే… రెండు మూడేళ్లు అక్కడే `లాక్ డౌన్` అయిపోతారని హీరోలపై జోకులు వేసుకుంటుంటారు ఫ్యాన్స్.
ఇప్పుడూ ఆ జోకులకు కొదవ లేకుండా పోయింది. ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఉదయం పది గంటలకు ఆర్.ఆర్.ఆర్ నుంచి స్పెషల్ సర్ప్రైజ్ రాబోతోందని, రామ్ చరణ్ లుక్ చూపిస్తామని చిత్రబృందం చెప్పింది. దాంతో చరణ్ ఫ్యాన్సంతా పది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూడ్డం మొదలెట్టారు. అనవాయితీ ప్రకారం ఫస్ట్ లుక్ లేటయ్యింది. దాంతో చిత్రబృందమే తమపై తాము జోకులు వేసుకోవడం మొదలెట్టింది.
ఈ పరంపర ఎన్టీఆర్‌తో మొదలైంది. ”నీ గిఫ్టు సరిచూడమని రాజమౌళికి రాత్రే పంపాను. ఆయన గురించి నీకు తెలుసు కదా.. బయటకు రావడానికి టైమ్ పడుతుంది” అంటూ చరణ్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. మరోవైపు కొత్తగా ట్విట్టర్లోకి అడుగుపెట్టిన మెగాస్టార్ కూడా అందుకున్నారు. ”ఐ యామ్ వెయిటింగ్” అంటూ.. ఖైదీ నెం.150లోని డైలాగ్‌ని ట్వీట్టర్లో వదిలారు.
దానికి రాజమౌళి రిప్లై కూడా ఇచ్చారు. ”సార్.. అంటే.. అదీ.. కొంచెం.. కొంచెమే.. ఆక్టువల్గా.. ప్లీజ్.. సార్” అంటూ భయం భయంగా సమాధానం చెప్పాడు రాజమౌళి. మొత్తానికి చరణ్ ఫస్ట్ లుక్ ఆలస్యం అవుతుందన్న సమాచారం మాత్రం తమదైన స్టైల్లో అభిమానులకు అందజేసింది రాజమౌళి టీమ్. మరి చరణ్ ఫస్ట్ లుక్ ఎప్పుడొస్తుందో. ఈలోగా ఎన్ని జోకులు బయటకు వస్తాయో..?