రాజమౌళి సినిమాలు ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తాయో, రాజమౌళికి, అతని టీమ్ కీ ఎంత పేరు తీసుకొస్తాయో.. మిగిలిన వాళ్లకు అంత పరీక్షగా మిగిలిపోతాయి. భారీ సినిమా ఏదొచ్చినా రాజమౌళి సినిమాలతో పోలికలు మొదలైపోతాయి. ఇది రాజమౌళి పోస్టర్ లా లేదు, ఈ ఎఫెక్ట్స్ రాజమౌళి అయితే ఇలా తీసుండేవాడు కాదు… అంటూ పోలుస్తుంటారు. ఇప్పుడు `ఆదిపురుష్`కీ ఈ ఇబ్బంది తప్పలేదు. ప్రభాస్ రాముడిలా కనిపించబోతున్న సినిమా `ఆదిపురుష్`. ఈ సినిమా అప్డేట్ల గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు `ఆదిపురుష్` నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. బాణాన్ని గాల్లోకి గురి పెట్టిన ప్రభాస్ – తన లుక్ తో మెస్మరైజ్ చేశాడు. అయితే ఈ లుక్పైనా పెదవి విరుస్తున్నారు కొంతమంది. `ఆర్.ఆర్.ఆర్`లో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ధనస్సు ఎక్కి పెట్టిన షాట్ ఒకటుంది. ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి పోలికలు తీస్తున్నారు. చరణ్ లుక్ తో పోలిస్తే… ప్రభాస్ లుక్ తేలిపోయిందన్నది అసలు కంప్లైంటు.
ఆర్.ఆర్.ఆర్ వేరు.. ఆది పురుష్ వేరు. అల్లూరి సీతారామరాజు వేరు.. రాముడు వేరు. ఈ ఇద్దరినీ పోల్చి చూడడంలో ఎలాంటి పాయింటూ లేదు. పోస్టర్ తోనే పోలికలు మొదలెడితే – ఇక టీజర్, ట్రైలర్ లో ఇంకెన్ని తీస్తారో? సినిమాలో ఇంకెన్ని వెదుకుతారో..? రాజమౌళి విజువల్స్ తోనో, తన క్రియేటివిటీతోనో మిగిలిన సినిమాల్ని పోల్చి చూడడం ఆయా సినిమాల ఫలితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. `ఆదిపురుష్` బెంగ కూడా అదే.