అమరావతి విషయంలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయంగా ఓ అవగాహనకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాభిప్రాయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు అని చెప్పలేదు కాబట్టి.. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని అంటోంది. ఈ విషయంలో వైసీపీ గట్టిగా ఏమీ చెప్పలేకపోతోంది. అయితే… ఇప్పుడు మరో ఆప్షన్ ఆ పార్టీ ముందుకు వచ్చింది. అదే నర్సాపురం లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక. అమరావతి కోసం రిఫరెండంగా.. ఉపఎన్నికను చూస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తే.. తాను రాజీనామా చేస్తానని రఘురామకృష్ణరాజు బహిరంగ సవాల్ విసిరారు.
నర్సాపురం ఎంపీపై వైసీపీకి పీకల మీద దాకా కోపం ఉంది. ఆయన ప్రతిపక్ష పార్టీల నేతలను మించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆయన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ను తరచూ వినిపిస్తున్నారు. ఇలాంటి డిమాండ్ వినిపించినప్పుడల్లా రఘురామకృష్ణరాజు ఫైర్ అవుతున్నారు. తన ఇమేజ్‌తోనే గెలిచానని.. తన వల్ల కొంత మంది ఎమ్మెల్యేలు గెలిచారని.. తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారా అని అడుగుతున్నారు. అయితే ఈ సారి మంత్రి బాలినేని విసిరిన సవాల్‌కు.. రఘురామకృష్ణరాజు భిన్నంగా బదులిచ్చారు. పార్టీకి చెడ్డపేరు రాకుండా ఉండేందుకే.. తాను అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్నానన్నారు. అమరావతిపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి తాను రాజీనామా చేస్తానని నర్సాపురం ఉపఎన్నికను .. రిఫరెండంగా జగన్‌తో ప్రకటింప చేస్తారా అని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినట్లుగా ప్రభుత్వం మొత్తం రద్దు చేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ రఘురామకృష్ణరాజు సవాల్ ప్రకారం అయితే.. ఒక్క నర్సాపురం నియోజకవర్గంతోనే.. రిఫరెండం పూర్తి చేయవచ్చు. అమరావతిపై మాట మార్చారనే విమర్శలకు.. ప్రజా మద్దతు లేదనే విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. అయితే.. ఈ విషయంలో వైసీపీ స్పందన ఏమిటో తెలియడం లేదు. ఒక వేళ జగన్.. నిజంగానే.. రఘురామకృష్ణరాజు సవాల్‌కు స్పందిస్తే.. అమరావతి వివాదానికి ఓ లాజికల్ కంక్లూజన్ లభించే అవకాశం ఉంటుంది. మరేం చేస్తారో..?