`RRR` టీమ్ నుంచి ఓ కీలకమైన అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ధృవీకరించింది. అంతేకాదు… రామ్ చరణ్, ఎన్టీఆర్లు కలిసి వున్న స్టిల్ ని విడుదల చేసింది. గుర్రంపై చరణ్.. దౌడు తీస్తుంటే, బైక్ పై ఎన్టీఆర్ రివ్వున దూసుకుకొస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకే.. వీరిద్దరి టీజర్లూ బయటకు వచ్చాయి. కలిసి కనిపించే స్టిల్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. నిజానికి 2020 వేసవికి రావల్సిన సినిమా ఇది. 2021 సంక్రాంతికి వస్తుందనుకున్నారు. 2021 వేసవికైనా రావడం ఖాయం అనుకున్నారు. కానీ.. దసరాకి వాయిదా పడింది. ఈ రిలీజ్ డేట్ ప్రకటించే ముందు రాజమౌళి చిత్రబృందంతో తీవ్రమైన తర్జన భర్జనలు పడినట్టు సమాచారం. ఈసారి రిలీజ్ డేట్ ఇస్తే.. ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదని.. రాజమౌళి భావించార్ట. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా నడుస్తుండడంతో.. రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చిందని, అందుకే… అధికారికంగా ప్రకటించేశారని టాక్.