ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలు. అన్నింటికంటే ముఖ్యంగా రాజమౌళి – ఆర్.ఆర్.ఆర్. ఎందుకంటే రాజమౌళి సినిమా అంటే అది పంచ వర్ష ప్రణాళికే. ఓ రిలీజ్ డేట్ కి కట్టుబడి ఉండడం ఆయన వల్ల కాదు. తన ఆలోచనలు, కథలు, అన్నీ భారీగానే ఉంటాయి కాబట్టి – ఆ మాత్రం ఆలస్యం, వాయిదాల పరంపరకు ఓపిక వహించాల్సిందే.
ఆర్.ఆర్.ఆర్ విడుదల పలుమార్లు వాయిదా పడింది. అక్టోబరు 13న ఈ సినిమా తీస్తుకొస్తున్నామని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించేసింది. అప్పుడు ఈ సినిమా రావడం దాదాపు అసాధ్యమే అని చిత్రసీమతో పాటు ఎన్టీఆర్, చరణ్ అభిమానులు కూడా నమ్ముతున్నారు. అయితే అనూహ్యంగా ఈ రోజు కొమరం భీమ్ పోస్టర్ లో రిలీజ్ డేట్ కూడా కనిపించింది. అక్టోబరు 13న ఈ సినిమాని విడుదల చేస్తున్నామని చిత్రబృందం మరోసారి డంకా బనాయించింది. ఇదేం లాజిక్కో సినీ జనాలకు అర్థం కావడం లేదు.
నిజానికి.. కరోనా మహత్తు వల్ల అన్ని సినిమా డేట్లూ వాయిదా పడుతూ వెళ్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ కూడా అందుకు అతీతం ఏమీ కాదు. అక్టోబరు 13 అని ప్రకటించినా, విడుదల తేదీ మార్చే ఛాన్సుందన్నది బహిరంగ రహస్యం. అక్టోబరు 13న ఏర్పడిన ఖాళీని పూడ్చాలని పుష్ష లాంటి సినిమాలు ప్రయత్నిస్తున్నాయి. పుష్ష ఆ టైమ్ కి వచ్చినా రాకపోయినా, కొన్ని సినిమాలు అక్టోబరు 13ని టార్గెట్ చేశాయి. ఆర్.ఆర్.ఆర్ ఎలాగూ సంక్రాంతికే వస్తుందని భావించిన నిర్మాతలు – ఆ సమయంలో తమ సినిమా లేకుండా జాగ్రత్త పడ్డాయి. అలా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ పై చాలా సినిమాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధార పడ్డాయి. ఇప్పుడు వాటన్నింటినీ మళ్లీ కన్ఫ్యూజన్ లో పడేశాడు రాజమౌళి. పరిస్థితులు చక్కబడడానికి మరో రెండు నెలలైనా పడుతుంది. అప్పుడు వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధ పడతాయి. ముందు మార్చి, ఏప్రిల్, మేలలో రావాల్సిన సినిమాలకు స్లాట్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ లెక్కన అక్టోబరు 13న ఫిక్సయిన ఆర్.ఆర్.ఆర్ కాస్త వెనక్కి వెళ్లాలి. కానీ ఏ ధైర్యంతో రాజమౌళి రిలీజ్ డేట్ మార్చలేదో అర్థం కాదు. సినిమా అంతా సిద్ధంగా ఉండి, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు పూర్తవుతుందో రాజమౌళికి ఓ స్పష్టమైన అంచనా ఉందని, అందుకే రిలీజ్ డేట్ మార్చలేదని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రాజమౌళి ఇప్పుడు అక్టోబరు 13నే వస్తానన్నా.. కాదు, కుదరదు అని చెప్పేంత సీన్ ఎవరికీ లేదు. ఇష్టం లేకపోయినా సైడ్ ఇవ్వాల్సిందే. సో.. అక్టోబరు 13న ఆశలు పెట్టుకున్న మిగిలిన సినిమాలు ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ అన్వేషించాలి