శాసనమండలి రద్దు అంశాన్ని పార్టీ విధానం మేరకు తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు … ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి హామీ ఇచ్చారు. సజ్జలకు రఘురామ ఇలాంటి హామీ ఇవ్వడం వెనుక ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి. రోజువారీగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ లేఖలు రాస్తున్న రఘురామకృష్ణరాజు ఈ రోజు.. శాసనమండలి అంశాన్ని ఎంచుకున్నారు. మెజార్టీ లేనప్పుడు రద్దు చేస్తామని చెప్పి..ఇప్పుడు వెనక్కి తగ్గితే ప్రజలు ఊరుకోరన్నారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారని లేఖలో పేర్కొన్నారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలన్నారు.
రఘురామ ఈ లేఖను మీడియాకు విడుదల చేసే సందర్భంలో.. వైసీపీకి చెందిన నలుగురు గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అ ప్రమాణస్వీకారానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అప్పుడు.. మండలి రద్దు అంశం.. రఘురామకృష్ణరాజు లేఖలపై ఆయన స్పందించక తప్పలేదు. మండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకోవడం లేదని చెప్పుకొచ్చారు. మండలి రద్దు తీర్మానం ఎత్తుగడతో చేసింది కాదని కూడా వాదించారు. ఈ ప్రకటనను అంది పుచ్చుకున్న రఘురామృష్ణరాజు మళ్లీ వెంటనే ప్రకటన చేశారు.
మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదని నలుగురు నూతన శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పినందుకు సీఎం జగన్కు, సజ్జలకు శుభాభినందనలు చెప్పారు. ఈ రోజు నుంచే మండలి రద్దు నా బాధ్యతగా స్వీకరించి రద్దు దిశగా కర్తవ్యోన్ముఖుడినై పనిచేస్తాననని సందేశం పంపారు. ఇప్పుడు.. మండలి రద్దు కోసం.. రఘురామకృష్ణరాజు కేంద్రానికి .. రాజ్యాంగ పెద్దలకు లేఖలు రాయడమో… వ్యక్తిగతంగా కలిసి వైసీపీ విధానం ప్రకారం.. రద్దు చేయమని కోరడమో చేస్తారు. ఈ అంశంపై రఘురామకృష్ణరాజు రచ్చ చేస్తే.. వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రఘురామకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వైసీపీ నానా తంటాలు పడుతోంది.