నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. గోదావరి వెటకారంతో.. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కరోనా వైరస్ విషయంలో.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన… వెటకారంతో కూడిన సూచనలు, సలహాలతో హైలెట్ చేస్తూ.. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో.. జగన్మోహన్ రెడ్డి వైరస్‌ను తేలికగా తీసుకోవడం దగ్గర్నుంచి మాస్క్ పెట్టుకోకపోవడం వరకూ ప్రతీ అంశంపైనా… విమర్శలు చేశారు. కానీ అవి విమర్శలు కాదు.. సలహాలుగా… సెటైర్లుగా మీడియాకు వినిపించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాస్క్ పెట్టుకోరు. నవమహోత్సవంలో పాల్గొన్న రోజు మాత్రం.. ఒక్క సారి మాస్క్ పెట్టుకుని కనిపించారు. ఆయన ఏ కార్యక్రమంలో పాల్గొన్నా… మాస్క్ పెట్టుకోలేదు. అధికారిక కార్యక్రమ కోసమే.. ఏదైనా సమావేశంలో పాల్గొన్నా.. ఏదైనా పథకానికి డబ్బులు పంపించే కార్యక్రమంలో పాల్గొన్నా.. చుట్టూ ఉన్న వారందరూ మాస్క్ పెట్టుకుంటారు కానీ.., ఆయన మాత్రం పెట్టుకోరు. దీంతో.. ముఖ్యమంత్రే మాస్క్ పెట్టుకోకపోతే.. సాధారణ ప్రజలు ఎలా పెట్టుకుంటారని.. ఆదర్శంగా ఉండాల్సిన సీఎం నిబంధనలు పాటించకపోవడం ఏమిటనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీన్ని రఘురామకృష్ణరాజు.. తనదైన స్టైల్లో ఎస్టాబ్లిష్ చేశారు. చిరంజీవి కంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారని… చిరంజీవి మాస్క్ పెట్టుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని.. జగన్ కూడా అలాంటి ప్రయత్నమే చేయాలని పిలుపునిచ్చారు. జగన్ అభిమానులందరూ.. ఆయన చెబితే పాటిస్తారని.. ఆయనంటున్నారు. చిరంజీవి తరహాలోనే చక్కని షార్ట్ ఫిల్మ్ చేయమని రఘురామకృష్ణరాజు సలహా ఇచ్చారు.
అంతే కాదు.. పథకాలన్నింటికీ జగనన్న అనే పేరు పెట్టడంపైనా… కొత్త రకం సెటైర్ వేసారు. పథకాలు జగనన్న పేరుతో ఉంటున్నాయని.. అలాగే జగనన్న పేరుతో ఈ వైరస్‌పై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. జగనన్న పేరు కచ్చితంగా ఉంటేనే ప్రజల్లో, అధికారుల్లో సీరియస్ నెస్ ఉంటుందని సీరియస్‌గా చెప్పారు. జగన్ విషయంలో తప్ప.. మరే విషయంలోనూ అధికార యంత్రాంగం స్పందించదన్నట్లుగా ఆయన మాట్లాడారు. వైరస్‌పై పోరాటానికి.. ” జగనన్న కరోనా కేర్” అనో..”జగనన్న కరోనా వార్ ” అనో ఏదైనా పేరు పెడితే బాగుంటుందని కూడా పేర్లు కూడా సూచించారు.
ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడంలో… రఘురామకృష్ణరాజు.. ప్రత్యేక శైలిని అవలంభిస్తున్నారు. రాజకీయంగా వైసీపీ తనను టార్గెట్ చేయడంతో.. మొత్తంగా వైసీపీని తాను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. అంశాల వారీగా…. ఎక్కడా దొరకకుండా… వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమైనా అంటే తాను పార్టీని.. పార్టీ అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదని.. ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నానని అంటున్నారు. ఆ తరహాలోనే మాట్లాడుతున్నారు. కానీ అవి వైసీపీ నేతలకు సూటిగా గుచ్చుకుంటున్నాయి.