ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుంచి `దోస్తీ` పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన లిరికల్ వీడియోలకు భిన్నంగా సాగిన పాట ఇది. దీని కోసం సుమారు 3 కోట్ల ఖర్చు చేసినట్టు సమాచారం. పాట చివర్లో చరణ్, ఎన్టీఆర్లు చేయీ చేయీ కలపడం… అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అందించింది. అయితే…. `దోస్తీ` పాటకు ఇది ఒక వెర్షన్ మాత్రమే. మరో వెర్షన్ కూడా ఉంది. దాన్ని సినిమాలోనే చూడాలి. ఈ `దోస్తీ` పాటలో మాత్రం చిత్రబృందం అంతా కనిపిస్తుంది. రాజమౌళి, అజయ్ దేవగణ్, అలియాభట్, సింథిల్.. ఇలా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఈ పాటలో కనిపిస్తారు. `దోస్తీ` పాట సినిమా మొత్తం బిట్లు బిట్లుగా వినిపిస్తుందట. చివర్నో మాత్రం.. ఎండ్ టైటిల్స్ లో చిత్రబృందం అంతా ఈ పాట లో కనిపించి కనువిందు చేయబోతోంది. ఈ సినిమాలోని మిగిలిన పాటల లిరికల్ వీడియోలు సైతం ఇలానే కొత్తగా ఆలోచించి, డిజైన్ చేసి వదలబోతున్నారు. అందుకోసం ప్రత్యేకమైన బడ్జెట్ కూడా కేటాయించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.