రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయించాలని శక్తియుక్తులు మొత్తం కేంద్రీకరిస్తున్న వైసీపీకి.. రెబల్ ఎంపీ చాలా కూల్‌గా కౌంటర్ ఇస్తున్నారు. రఘురామపై తక్షణం అనర్హతా వేటు వేయాలని .. సుప్రీం కోర్టు తీర్పులను ఉదహరిస్తూ.. స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయిరెడ్డి రాసిన లేఖకు.. కౌంటర్ లేఖను పంపారు రఘురామకృష్ణరాజు. విజయసాయిరెడ్డి.. ఏ సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారో.. తాను కూడా అలాంటి సుప్రీంకోర్టు తీర్పులనే ఉదహరిస్తూ.. తనపై అనర్హతా వేటు వేయడానికి అవకాశం లేదని చెప్పుకొచ్చారు. తనపై అనర్హత వేటు వేయాలంటూ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోవద్దని .. పార్టీ క్రమశిక్షణను ఎక్కడా ఉల్లంఘించలేదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.
తాను చేసిందంతా.. ప్రభుత్వ వైఫల్యాలను చక్కదిద్దుకోవాలని హితవు చెప్పడమేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను చెబితే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు రాదని.. భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అసమ్మతి కాదని చెప్పుకొచ్చారు. గతంలో ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను లేఖకు జత చేశారు. తన ప్రవర్తన ఏ విధంగా చూసినా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు రాదని .. పార్టీ విప్‌ను ఎన్నడూ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
అలా స్పీకర్‌కు లేఖ రాసి.. ఇలా రఘురామకృష్ణరాజు సభ్యత్వం రద్దయినట్లేనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్న వైసీపీ నేతలకు రఘురామకృష్ణరాజు అన్ని ఆధారాలతో ఇస్తున్న కౌంటర్ ఇబ్బందికరంగా మారింది. స్పీకర్ ఓం బిర్లా కూడా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. తాను పార్టీ ఫిరాయింపుకు పాల్పడలేదని.. రఘురామకృష్ణరాజు వాదిస్తున్నందున.. ఆయనపై అనర్హతా వేటు వేయడం సాధ్యం కాదని.. పార్లమెంటరీ వ్యవహారాల నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.