నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. అమరావతి విషయంలో తన పార్టీ విధానానికి పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుని అగ్రెసివ్‌గా ముందుకెళ్తున్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ.. ఆయన నేరుగా రాష్ట్రపతికి వినతి పత్రం కూడా సమర్పించారు. కేంద్ర బలగాలతో రక్షణ కోసం విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్రపతిని కలిసిన రఘురామకృష్ణరాజు.. అమరావతి అంశంపైనే ఎక్కువగా మాట్లాడినట్లుగా ప్రకటించారు. తన భద్రత విషయమే కాకుండా.. విడిగా ప్రత్యేకంగా అమరావతి కోసం.. లే్ఖ ఇచ్చినట్లుగా చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అమరావతి ఉండాల్సిందేనని రఘురామకృష్ణరాజు అంటున్నారు. తాము అమరావతి ఇల్లు, ఆఫీసు కట్టుకున్నానని చెప్పి.. అందర్నీ నమ్మించిన జగన్ ఇప్పుడు .. మూడు రాజధానులకు మడమతిప్పడం మంచిది కాదంటున్నారు.
ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తాను రాష్ట్రపతికి చెప్పానని.. ఎంపీ ప్రకటించారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు చట్ట విరుద్ధంగా గవర్నర్ వద్దకు పంపారని.. రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువ భూములిచ్చారని.. వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాల్సి ఉందన్నారు. ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కొనసాగేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాత్రికి రాత్రి రాజధాని విశాఖ వెళ్లిపోయినా .. పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు.. పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగని సానుకూలంగా కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఇటీవల పార్టీతో విబేధాలు వచ్చిన తర్వాత మెల్లగా మూడు రాజధానులకు మద్దతు తెలుపుతున్నా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రం… అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు.. తన డిమాండ్‌కు మరింత బలం ఇస్తూ.. రాష్ట్రపతికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి రఘురామకృష్ణరాజు.. రాజధాని విషయంలో ప్రభుత్వానికి మరింత చికాకు తెప్పించే అవకాశం కనిపిస్తోంది.