ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు, దానికి రాజమౌళి దర్శకుడు అనగానే, అంతా షాకయ్యారు. కచ్చితంగా ఇండియన్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవ్వబోతోందని ముందే ఊహించారు. దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ని తయారు చేశాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న పక్కన పెడితే, ఈ సినిమా హైప్ మామూలుగా లేదు. ఎన్నిసార్లు ఈ సినిమా వాయిదా పడినా, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. పైపెచ్చు పెరుగుతోంది.
ఈ సినిమా రిజల్ట్ మాట పక్కన పెడితే, ఇద్దరు హీరోల్లో డామినేషన్ ఎవరిది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌కీ, రాజమౌళికీ ఉన్న సాన్నిహిత్యం మేర… ఈ తక్కెడ ఎన్టీఆర్ వైపే తూగుందని ముందు నుంచీ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. స్వతహాగా… చరణ్ తో పోలిస్తే ఎన్టీఆర్ మంచి పెర్ఫార్మర్. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. చరణ్ ని ఎన్టీఆర్ డామినేట్ చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే తెరపై ఏం జరిగింది? రాజమౌళి ఎవరిపై ప్రేమ చూపించాడు? అనేది సినిమా రిలీజైతే గానీ తెలీదు.
కానీ ఇప్పటికైతే, మీడియా ఇంటర్వ్యూలలో చరణ్ కంటే ఎన్టీఆర్‌దే డామినేషన్. మంగళవారం ప్రింట్, వెబ్ మీడియాలతో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి మాట్లాడారు. ఈ మీట్ లో ముగ్గురిలో ఎన్టీఆర్ దే డామినేషన్. చాలా హుషారుగా కనిపించాడు. తనది కాని ప్రశ్నలోనూ దూరి, ఫన్ క్రియేట్ చేశాడు. అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మార్చేశాడు. ఈ మీట్ లో చరణ్ తో తన బాండింగ్ చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా తప్పకుండా ఓ మైల్ స్టోన్ గా మిగిలిపోతుందన్న నమ్మకం… ఎన్టీఆర్ కళ్లల్లో, మాటల్లో స్పష్టంగా కనిపించింది. వినిపించింది.
తాజాగా అనిల్ రావిపూడితో ఎన్టీఆర్, చరణ్, రాజమౌళిల ఓ వీడియో ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడా ఎన్టీఆర్ దే డామినేషన్. తన టైమింగ్ తో, ఫన్ తో… వినోదం పంచాడు. తనకు హీరోయిన్ లేదని, ఉన్నా లేనట్టే అని, అసలు తనకెందుకు హీరోయిన్ పెట్టారో అర్థం కాలేదని ఎన్టీఆర్ చెప్పిన విధానం… కావల్సినంత ఫన్ క్రియేట్ చేసింది. ఏది అడిగినా.. రాజమౌళి ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తాడన్న విషయాన్ని నటించి మరీ చూపించడం మరో హైలెట్. ఇలా.. ప్రతీ చోటా.. ప్రతీ సారీ ఎన్టీఆర్ వాతావరణాన్ని చాలా లైవ్లీగా మార్చేస్తున్నాడు. స్క్రీన్ పై ఎవరికి ఎన్ని మార్కులు పడతాయో ఇప్పుడే చెప్పలేం గానీ, మీడియా దగ్గర మాత్రం …. ఎన్టీఆర్ కి ఫుల్ మార్కులు పడిపోయాయి.