ఈ రోజు ఉగాది అన్న సంగతే తెలుగు జనాలు మర్చిపోయారు. కరోనా అంతగా భయపెడుతోంది. పుట్టిన రోజులు, పెళ్లి రోజులూ – అంటూ ప్రత్యేక సందర్భాల్ని గుర్తు చేసుకుని మరీ వేడుకు చేసుకునే వాతావరణం ఇప్పుడు లేదు. ప్రపంచమంతా ఇదే స్థితి. టీవీ ఛానళ్లనీ, పేపర్లనీ, మనిషి జీవితం మొత్తాన్నీ కరోనా ఆక్రమించేసింది.
ఈ సందర్భంగా `ఆర్.ఆర్.ఆర్` టైటిల్‌లోగోని, మోషన్ పోస్టర్నీ విడుదల చేస్తున్నాడు రాజమౌళి. నిజానికి ఈ సినిమా గురించి ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా అదో పెద్ద పండగలా ఉండేది. ఇక టైటిల్ చెప్పేస్తానంటే ఇక ఆ సంబరం అంబరాన్ని తాకాల్సిందే. ఈ సినిమా టైటిల్ ఎప్పుడు చెబుతారా అంటూ చాలా కాలం నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది సందర్భంగా, ఈనెల 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ ని ప్రకటిస్తోంది చిత్రబృందం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు టైటిల్ ఏమిటో చెప్పేస్తారు. అయితే ఇలాంటి సమయంలో… సినిమా ప్రచారాలు అవసరమా? అనే చర్చ మొదలైంది. కరోనా భయంతో ప్రపంచం వణికిపోతోంటే.. అవేం పట్టనట్టు సినిమా ప్రచారం చేసుకోవడం హర్షించదగిన విషయం కాదు.జనాలు అంతా ఇంట్లో ఖాళీగా ఉంటారు. తన సినిమా గురించో, టైటిల్ గురించో మాట్లాడుకునే టైమ్ దొరుకుతుంది అని జక్కన్న భావించి ఉంటాడు. కాకపోతే.. ‘రాజమౌళి సినిమా టైటిల్ వస్తుందిరోయ్’ అంటూ ఊగిపోయే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపించడం లేదు. జనాల ఆలోచనలు వేరు, అవసరాలు వేరు. వీటి మధ్య రాజమౌళి ప్రమోషన్‌కి అనుకున్నంత స్పందన రాకపోవొచ్చు కూడా.