వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సారి పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని నిర్ణయించుకుంది. రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు డిమాండ్‌తో ఈ సభను స్తంభింపచేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పార్టీ పరమైన డిమాండ్ కోసం.. సభను ఉపయోగించుకుంటే విమర్శలు వస్తాయని … స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కారణాన్ని అడ్డు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఏ వ్యూహం అవలంభించాలన్నదానిపై… ముఖ్యమంత్రి జగన్ ఎంపీలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ నేత్రుత్వంలో జరగనుంది. రఘురామకృష్ణరాజుకు మాత్రం ఆహ్వానం పంపలేదు.
వైసీపీ ప్రభుత్వం… లోక్‌సభలో ఎక్కు వమంది ఎంపీలున్న పార్టీల్లో ఒకటి. కానీ గత రెండేళ్ల నుంచి ఆ పార్టీ బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే వ్యవహరిస్తోంది. ఎక్కడా సమస్యలపై పోరాడినట్లుగా లేదు. రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క అంశం పరిష్కారం కాకపోయినా సభలో మాట్లాడటం లేదు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల కాకపోవడం, కృష్ణా జలాల వివాదం .. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ.. రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల, రుణపరిమితి తగ్గింపు ,ప్రత్యేక హోదా , వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. అదే సమయంలో కేంద్రానికి వివాదాస్పద బిల్లుల విషయంలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు.
అయితే ఇప్పుడు కూడా ఈ అంశాలపై వైసీపీకి సీరియస్ నెస్ లేదని.. కేవలం రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేసేలా స్పీకర్‌పై ఎలా ఒత్తిడి తేవాలన్నదానిపైనే ప్రధానంగా సీఎం సలహాలిస్తారన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. సభను స్తంభింపచేయడంతో పాటు.. ఆయనపై ఆరోపణలు చేయడం ద్వారా.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తరహా ప్రయత్నాలను ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా… వైసీపీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉందంటున్నారు. సభలోనే రఘురామకృష్ణరాజు కూడా ఉండనున్నారు. దీంతో .. ఆయన కూడా కౌంటర్లు ఇవ్వడం ఖాయం.