కరోనా ఖాతాలో ఈ రోజు పదకొండు లక్షల కోట్ల రూపాయలు పడ్డాయి. స్టాక్ మార్కెట్లు.. వైరస్ దెబ్బకు చిక్కిపోవడం ప్రారంభించాయి. లక్షల కోట్లలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతోంది. కొద్ది రోజలుగా.. దాదాపుగా మార్కెట్ రూ. 20 లక్షల కోట్లు నష్టపోయింది. దీనికి ప్రధానమైన కారణం కరోనానే. కరోనా కేంద్రం వరుసగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనేక రుగ్మతలు వచ్చి చేరుతున్నాయి. దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి.. ఒక దేశం నుంచి మరో దేశానికి రాకపోకలు ఆపేస్తున్నాయి. అదే సమయంలో… ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం కూడా పడిపోయింది.
ఫలితంగా ఆయిల్ అమ్ముకునే దేశాల మధ్య వార్ ప్రారంభమయింది. రష్యా.. ఓపెన్ నుంచి బయటకు వచ్చి ధరల యుద్ధం ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లు తుమ్మితే..ఇండియాలో పెట్టుబడిదారులు… ఎగబడి స్టాక్స్ అమ్మేస్తూంటారు. ఇక ప్రపంచం మొత్తం తుమ్ముతూంటే ఊరుకుంటారా..? చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా మార్కెట్లలో ఉన్నదంతా ఊడ్చుకుని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులు దీనికి మినహాయింపు కాదు.
పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. భారత ఆర్థిక వృద్ధి రేటు.. మామూలుగానే చాలా తక్కువగా ఉంది.. తాజా పరిస్థితుల్లో ఇది మరింత తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా స్టాక్ మార్కెట్ ను కుదిస్తున్నాయి. ఇప్పుడల్లా స్టాక్ మార్కెట్లు కోలుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగానే వస్తున్నాయి. మొత్తానికి కనిపించని కరోనా… లక్షల కోట్లను రోజూ.. కరిగించేస్తోంది.