ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత నివాసానికి ఇప్పటి వరకూ ప్రజాధనాన్ని రూ. 15 కోట్ల 65 లక్షలు వెచ్చించారు. ఇంత మొత్తానికి ప్రభుత్వమే.. ముఖ్యమంత్రికి ఓ ప్రగతి భవన్ లాంటి నిర్మాణాన్ని కట్టించవచ్చు కదా.. అనే సందేహం ఎవరికైనా వస్తుంది. సీఎం ప్రైవేటు గృహానికి ఇంత మొత్తమా.. అనే ఆశ్చర్యం.. అందరికీ వేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే.. ఆయన సీఎం కాక ముందు కట్టించుకున్న ఇంటికి ఇప్పుడు బిల్లులు పెట్టి.. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మును విడుదల చేసుకుంటున్నారు. తాజాగా.. ఆయన ఇంటికి కిటికీల కోసం ఖర్చు అయిందంటూ.. ఏకంగా.. రూ.73 లక్షల రూపాయలు విడుదల చేశారు. కిటికీల కోసమే.. రూ. 73 లక్షలా… అని నిర్మాణ రంగ నిపుణులు ఆశ్చర్యపోతూంటే… అదేంటి..? ఆయన ఇంటికి ఇంత వరకూ కిటికీలు కూడా పెట్టుకోలేదా.. అని సామాన్యులు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
ఇది మాత్రమే కాదు.. వ్యూ కట్టర్ పేరుతో… మరో ఏర్పాటు చేశారు. ఈ వ్యూ కట్టర్ ఏమిటో చాలా మందికి తెలియదు దీని కోసం.. ఏకంగా.. మూడున్నర కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఎవరెంత ఆశ్చర్యపోయినా… ఆ నిధుల విడుదల పరంపర.. గత ఐదు నెలలుగా అలా సాగుతూనే ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తన ఇంటినే క్యాంప్ ఆఫీస్గా ప్రకటించుకున్నారు. అప్పట్నుంచి.. ఇప్పటికి .. అంటే ఐదు నెలల కాలంలో.. రూ. పదిహేను కోట్ల అరవై లక్షలకుపైగా.. ఆయన ఇంటి కోసం ప్రజాధనాన్ని మంజూరు చేశారు. మొదటగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంటికి 1.3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ. ఐదు కోట్లు మంజూరు చేశారు. ఆదే సమయంలో.. ఓ బాత్రూమ్ నిర్మాణానికి రూ. 30 లక్షలు, హెలిప్యాడ్.. ఇతర అవసరాలకు రూ. రెండు కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత .. జగన్ ఇంట్లో ఎలక్ట్రికల్ మెయినటనెన్స్ కోసం.. రూ. 90 లక్షలు విడుదల చేశారు. అవి అలా నడుస్తూండగానే.. తాజాగా జగన్ ఇంట్లో ఏసీలు, ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం.. దాదాపుగా రూ. 3 కోట్ల 63 లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు కిటికీల కోసం.. మరో రూ. 73 లక్షలు ఇచ్చారు. వ్యూ కట్టర్ కోసం రూ. మూడున్నర కోట్లు విడుదల చేసుకున్నారు.
ఇన్ని కోట్లు పెట్టింది… కూడా.. ముఖ్యమంత్రి ప్రైవేటు ఆస్తికి మెరుగులు దిద్దడానికే. జగన్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభుత్వ ఆస్తి కాదు. నిజానికి.. జగన్ ఇంటి కోసం మంజూరు చేసిన నిధులతో.. ఓ విలాసవంతమైన ఇల్లునే నిర్మించవచ్చు. కానీ గత ఐదు నెలలుగా.. ఏదో ఓ వంకతో.. ఆ ఇంటికి నిధులు మంజూరు చేస్తూనే ఉన్నారు. రేపోమాపో.. శ్లాబ్ ఖర్చులని.. విడుదల చేసుకున్నా.. ఆశ్చర్యం లేదనే సెటైర్లు కూడా ప్రారంభమయ్యాయి. అదీ కూడా విడుదల చేస్తే.. ఆ ఇంటిని ఇక ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు కూడా పోయేదేమీ లేదని.. ఆ ఇంట్లో ప్రజాధనం రూ. పదిహేను కోట్లు ఉంది కాబట్టి.. తర్వాత ప్రభుత్వం మారినా దాన్ని… ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించవచ్చంటున్నారు.