ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో.. అరుదైన క్రియేటివిటీని చూపిస్తూ.. ఎంత కావాలంటే అంత అప్పును వివిధ పద్దతుల్లో తెచ్చుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల అంటే.. ఏప్రిల్లో…ప్రభుత్వం చేసిన అప్పు.. అక్షరాలా రూ.16,903 కోట్లు. ఒక్క నెలలో ఇంత మొత్తం అంటే.. ఇదే పద్దతిలో రుణాలు తీసుకుంటే.. ఏడాదికి రూ. రెండు లక్షల కోట్ల అప్పు దాటిపోతుంది. ఏపీ బడ్జెట్ కూడా అంత లేదు. అంటే.. బడ్జెట్ను మించి అప్పు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించడం ఖాయమన్నమాట. ఏప్రిల్ నెల .. పూర్తి లాక్ డౌన్ కాలం. ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అందుకే ఉద్యోగుల జీతాలను కూడా సగానికిపైగా కత్తిరించారు. అయినా ఖర్చులు తగ్గకపోవడంతో… ఒక్క నెల లోటు రూ. 14వేల కోట్లకుపైగానే తేలింది.
ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చు రూ. 21, 358 కోట్లుగా కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్క తేల్చారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలంటే.. ఆదాయం ఉండాలిగా. కానీ వచ్చిన ఆదాయం మాత్రం.. కేవలం రూ7,221 కోట్లు. ఇందులో కేంద్రం ఇచ్చిన సాయం రూ.4097 కోట్లు. అంటే.. ఏపీ సర్కార్ నికరంగా సమకూర్చుకుంది రూ. 3200 కోట్లే. మరి మిగతా మొత్తం ఎలా..?. ఉన్న ఒకే ఒక్క మార్గం అప్పులు. లాక్ డౌన్ కారణంగా కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచడం.. మార్కెట్ రుణాలు తీసుకునే వెసులుబాటు పొడిగించడంతో పాటు… ఇతర రుణాలను ప్రభుత్వం తీసుకుంది. ఇలా తీసుకున్న రుణాలు ఒక్క నెలలోనే… రూ. 17వేల కోట్లకు దరి దాపుల్లో ఉన్నాయి. ఏప్రిల్ నెలకు జీతాలు, పెన్షన్లు సగం మొత్తమే చెల్లించినా జీతాలకు రూ.3,624 కోట్లు అయింది. అంటే నెల జీతాల బిల్లు 7వేల కోట్లు దాటిపోయిందన్నమాట.
గత ఆర్థిక సంవత్సరంలో.. ప్రభుత్వం రూ. 80వేల కోట్లు అప్పు చేసిందని లెక్కలు తేలాయి. ఆ రికార్డును.. ఈ అర్థిక సంవత్సరంలోనే తొలి మూడు నాలుగు నెలల్లోనే అధిగమించడం ఖాయంగాకనిపిస్తోంది. విదేశీ ట్రస్టుల నుంచి సైతం… కొన్ని వేల కోట్ల అప్పులను తీసుకోవడానికి ఏపీ సర్కార్ ప్రణాళిక వేస్తోంది. ఎక్కడ అప్పు పుడితే.. అక్కడ వడ్డీ ఎంత అని చూసుకోకుండా తీసుకుంటోంది. ఫలితంగా.. ఏపీ రుణాల ఊబిలోకి కూరుకుపోతోంది. వస్తున్న ఆదాయం.. 35శాతానికిపైగా.. వడ్డీలు… అసలు చెల్లింపులకే పోతోంది. ఈ పరిస్థితి ఆర్థిక నిపుణుల్ని సైతం ఆందోళనకు గురి చేస్తోంది.