ముంబైలో బస్సులు, లోకల్ ట్రైన్స్, మెట్రో రైళ్ళు ఎటువంటి ప్రయాణ సాధనాలైన సరే నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తుంటాయి. ముంబై లోకల్ ట్రైన్స్ అయితే వాటి సామర్ధ్యానికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులని వారి గమ్యస్థానాలకి చేరవేరుస్తుంటాయి. దేశంలో అత్యంత ఎక్కువ జనసమర్ధం ఉన్న ప్రాంతాలలో ముంబై ఒకటి. ముంబై నగరంలో అర్ధరాత్రి 12.30 గంటల నుంచి తెల్ల రు జామున 3.30 గంటల వరకు మాత్రమే వాటికి విరామం ఉంటుంది. అన్ని గంటలు ఏకధాటిగా నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా కూడా మెట్రో రైలుకి గత రెండేళ్ళలో రూ. 300 కోట్లు నష్టం వచ్చిందని తాజా సమాచారం. నిర్వహణ భారం పెరగడం, ప్రభుత్వం నుంచి రావలసిన రాయితీలు అందకపోవడం వంటి కారణాలతో భారీ నష్టాలు కలిగాయని తెలుస్తోంది.
ముంబై వంటి ప్రాంతంలోనే మెట్రో రైల్ విజయవంతం కాలేకపోతే, ఇక హైదరాబాద్, విజయవాడ మెట్రోల పరిస్థితి ఏవిధంగా ఉండబోతోందనే అనుమానాలు కలగడం సహజం. విజయవాడతో పోలిస్తే హైదరాబాద్ చాలా పెద్ద నగరం. చాలా జనాభా, వ్యాపార అవకాశాలు కూడా ఉన్నందున కొద్దిపాటి నష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడగలదేమో కానీ విజయవాడలో మెట్రో లాభదాయకంగా నడుస్తుందా? అని అనుమానం కలుగుతోంది. సుమారు 60-70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ఆర్టీసీ వందల కోట్లు నష్టాలు మూటగట్టుకొంటూ ఎప్పుడూ ప్రభుత్వ ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తుండటం, ప్రభుత్వం వాటిని ఆదుకోలేక చేతులు ఎత్తేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకవేళ విజయవాడ మెట్రో రైల్ కి కూడా నష్టాలు వస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆదుకోగలదా? ఆదుకోలేకపోతే అప్పుడు దాని పరిస్థితి ఏమిటి? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పూర్తయితే జనాభా పెరిగి లాభదాయకంగానే ఉండవచ్చు కానీ అమరావతి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? అంతవరకు విజయవాడ మెట్రో పరిస్థితి ఏమిటి? అని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. డిల్లీ, ముంబై, కోల్ కత మహానగరాలలో మెట్రో రైల్ నిర్మించిన ఇచ్చిన మెట్రో నిపుణుడు శ్రీధరన్ మెట్రో రైల్ లాభదాయకంకావని, వాటిని ప్రభుత్వాలు సేవా దృక్పధంతో లాభాపేక్ష లేకుండా నిర్వహించడానికి సిద్దపడితేనే వాటి గురించి ఆలోచించడం మంచిదని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెపుతుంటారు. ప్రస్తుతం ఆయనే విజయవాడ మెట్రో ప్రాజెక్టుకి ముఖ్య సలహాదారుగా, పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. కనుక ఆ ప్రాజెక్టుపై ముందుకుసాగే ముందు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆయనని మరోమారు సలహా కోరడం మంచిది. ఇప్పుడే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే మంచిది.