పాత కాలంలో రాజులకు ఓ సంప్రదాయం ఉండేది. తమను పొగుడుతూ.. ఎవరైనా ఏదైనా పద్యమో.. పాటో.. డాన్సుల్లాంటివో చేస్తే… వెంటనే ఆయన ఆ రాజు మెచ్చేసి.. ” ఎవరక్కడ… ” అని సంస్థానంలోని వారిని పిలిచి.. ఆ కళాకారులకు.. ఏది అందుబాటులో ఉంటే ఆ సాయం ప్రకటించేవారు. మరీ ఆ రాజు గారికి మూడ్ బాగుంటే.. తన మెళ్లే వేసుకున్న చైన్లను కూడా తీసి ఇచ్చేవారని సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. దానికి బుధవారం విడుదలైన ఓ జీవోనే సాక్ష్యం.
అనంతపురం జిల్లాకు చెందిన ” సత్యసాయిబాబా నాటకోత్సవ సమితీ ” అనే సంస్థకు..ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ.. జీవో ఇచ్చారు. ఎందుకు అంటే… ఆ సంస్థలోని కళాకారులు.. తమ పేరుకు తగ్గట్లుగానే.. కళా ప్రదర్శన చేస్తున్నారు. అయితే.. చాలా మంది కళా ప్రదర్శన చేస్తారు కానీ.. అందరికీ ఇవ్వడం లేదుగా..? అనే డౌట్ రావొచ్చు. నిజమే.. కానీ వీరు చేసింది… పైన చెప్పుకున్నట్లుగా.. పాలకుల్ని మెచ్చే భిన్నమైన కళా ప్రదర్శన. ” జగన్ జయ కేతనం ” పేరుతో పద్యనాటకాల్ని వీరు ప్రదర్శించారట. ” జగన్ జయ కేతనం ” పద్యాల్ని చూసి ప్రభుత్వ పెద్దలు పరవశించి పోయి.. ఎవరక్కడ అని సాంస్కృతిక శాఖ అధికారుల్ని పిలిచి.. వారికి రూ. ఐదు లక్షలు బహూకరించండి.. అని ఆదేశాలిచ్చేశారు.
నిజానికి ప్రభుత్వాలు కళాకారుల్ని ప్రజా చైతన్య కార్యక్రమాలకు ఉపయోగించుకుంటాయి. కళ తప్ప మరో పని తెలియని వారికి ఉపాధి కల్పిస్తూ ఉంటాయి. కరోనా సమయంలో వారి అవసరం ఇంకా ఉంటుంది. కానీ ప్రభుత్వం పెద్దగా వారిని ప్రజలకు అవగాహన కల్పించాడనికి వాడుకున్నట్లుగా లేదు కానీ… ” జగన్ జయ కేతనం ” అనే పేరుతో పద్యనాటకం అనగానే ఐదు లక్షలు ఇచ్చేశారు. కొసమెరుపేమిటంటే… ఈ పద్యనాటటాన్ని ప్రదర్శించారా..? ప్రదర్శిస్తున్నారా..? ప్రదర్శిస్తూ ఉంటారా..? అన్నదానిపై వివరాల్లేవు. ప్రభుత్వం దగ్గర కూడా లేవు. అందుకే.. అన్ని వివరాలు తీసుకుని చెక్కులివ్వాలని జీవోలో పెట్టారు.