హెటెరో ఫార్మా కంపెనీలో ఇప్పటి వరకూ జరిగిన సోదాల్లో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం కనుగొన్నట్లుగా ఆదాయపు పన్నుశాఖ తెలిపింది. ఇందులో రూ.142.87కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆరు రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా తెలిపింది. సోదాల్లో మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించారు. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లోని పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నారు.
పెన్ డ్రైవ్‌లు, డాక్యుమెంట్లు, ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లు వంటి వ్యవహారాలను గుర్తించారు. వీటిని విశ్లేషించి సంస్థ మొత్తం ఎంత మేర అక్రమ ఆదాయాన్ని గడించిందో.. ఆ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చే అవకాశం ఉంది. ఆదాయపు పన్నుశాఖ అధికారింగా హెటెరో పేరును తన ప్రకటనలో వెల్లడించలేదు.
ఎప్పుడు సోదాలు చేసినా ఆదాయపు పన్నుశాఖ ఎంతెంత నగదు దొరికిందో వివరిస్తుంది కానీ… ఎప్పుడూ సంస్థ పేరు చెప్పదు. ఇప్పుడు కూడా చెప్పలేదు. అయితే హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా హెటెరోలో సోదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదాయపు పన్నుశాఖ హెటెరోలో చేసిన సోదాల గురించే ప్రకటించినట్లుగా భావింవచ్చు.