సంవత్సరాంతం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ.. వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో జాతీయ ప్రాజెక్టులన్ని వివరాలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. పోలవరం వ్యయం 55,548 కోట్లుగా ఈ నివేదికలో కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. 2017-18 ధరల పట్టిక ప్రకారం పోలవరం వ్యయాన్ని 55,548 కోట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 8,614 కోట్లు పోలవరానికి విడుదల చేశామని ప్రకటించారు. ఈ ఏడాది 1,850 కోట్లు ఇచ్చామని … వచ్చే ఏడాది 2,234 కోట్లు విడుదల చేయనున్నామని తెలిపింది.
కేంద్ర జలశక్తి శాఖ వార్షిక నివేదిక ఏపీ ప్రభుత్వాన్ని కాస్త సంతోష పరిచింది. ఎందుకంటే.. 2014 ధరల ప్రకారమే రీఎంబర్స్ చేస్తామని.. కేంద్రం కొద్ది రోజుల కిందట స్పష్టం చేసింది. ఇది ఇరవై వేల కోట్ల వరకే ఉంటుంది. ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదు. కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో… అదే పనిగా విజ్ఞప్తులు చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు… ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. నేడో రేపో సవరించిన అంచనాలకు ఆమోదం లభిస్తుందని ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి కేంద్ర జలశక్తి శాఖ పోలవరం వ్యయం 55,548 కోట్లు ఉంటుందని ఎప్పుడో ఆమోద ముద్ర వేసింది. చంద్రబాబు ఉన్నప్పుడు ధరలు సవరించిన అంచనాలు పంపించారు..అప్పుడు కేంద్రం అంగీకరించింది. వైసీపీ వచ్చాక…అదంతా ఏమీలేదు…2013-14 ధరల పట్టిక ప్రకారం ఇస్తామని ఏపీ సర్కార్కు కేంద్రం రివర్స్ టెండరేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ 20వేల కోట్లకే పరిమితమైనట్లుగా తేల్చేసి.. అనుమతించాల్సిందేనని ఏపీ సర్కార్ పై ఒత్తిడి తెస్తోంది. అయితే విభజన చట్టం ప్రకారం.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని.. మొత్తం ఖర్చు భరించాలని ఏపీ సర్కార్.. కేంద్రం వద్దకు విజ్ఞాపనలు తీసుకెళ్తోంది. మంత్రులు బుగ్గన, అనిల్ పదే పదే కేంద్రమంత్రుల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ అక్కడా హామీ లభించలేదు. ఆర్థిక శాఖ మాత్రం.. ఈ అంశంపై నోరు విప్పడం లేదు. దీంతో ఇప్పుడు…వార్షిక నివేదికలో… పోలవరం వ్యయాన్ని పూర్తి స్థాయిలో చూపించడంతో ప్రభుత్వానికి కాస్త చల్లగాలి తగిలినట్లయింది.