తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతం ఇవ్వడం తెలంగాణకు ద్రోహం చేసినట్లేన్నట్లుగా మాజీ అఖిల భారత సర్వీస్ అధికారి, ప్రస్తుత రాజకీయ నాయకుడు. బహుజన వాది ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై ఆరున్నొక్క రాగాలు వినిపిస్తున్నాయి. అందులో ఒక్కటైనా ఆయనకు మద్దతుగా వినిపించడం లేదు. అన్నీ వ్యతిరేకంగా వినిపిస్తున్నాయి. కరుడు గట్టిన తెలంగాణ వాదులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొత్తగా తన మీద ఏదో ముద్ర వేసుకోవడానికి ఔట్ డేటెడ్ ప్రయత్నాలు చేస్తున్నారని .. ఇలాంటివన్నీ తనను తాను చర్నాకోలతో కొట్టుకున్నట్లుగానే ఉంటాయని సెటైర్లు వేస్తున్నారు.
ప్రాంతీయ ద్వేష రాజకీయానికి ఓ హద్దు
సంగీతానికి ప్రాంతం ఉంటుందా ?. ఆ సంగీతాన్ని పలికించే వ్యక్తికి ప్రాంతం ఉంటుందేమో సంగీతానికి కాదు. అందుకే మన నాటు నాటు పాట ప్రపంచదేశాల్లోకి వెళ్లింది. రెహమాన్ సంగీతం వరల్డ్ వైడ్ వండర్స్ క్రియేట్ చేసింది. అంత ఎందుకు తెలంగాణకు చెందిన సంగీత దర్శకుడు చెక్రీ టాలీవుడ్లో సంచలనాలను సృష్టించలేదా ?. సంగీతానికి ప్రాంతం ఆపాదించడంలోని ఆర్ఎస్ ప్రవీణ్ ఆలోచనలు దేశ స్థాయి నుంచి ఎంతగా కురచబడిపోయాయో అర్థమవుతుంది ?
గత పదేళ్లు ఆంధ్రోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారుగా తెలీదా ?
అంతగా తెలంగాణ అస్థిత్వం ఉండాలంటే… గత పదేళ్లలో జరిగిన వాటిపై ఎందుకు మౌనంగా ఉన్నారు. యాదాద్రి రూపశిల్పి ఎవరు ? ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి… ఆంధ్రా స్వామిజీ చినజీయర్ కాదా ?. అంత ఎందుకు తెలంగాణలో పదేళ్ల పాటు పునర్మిర్మాణం పేరుతో ప్రాజెక్టులు కట్టింది ఆంధ్రా మేఘా రెడ్డి కాదా.. అప్పుడు ఎందుకు తెలంగాణను కించప్రచడం అనిపించలేదు. క్రీడా సంఘాల పదవుల్లో ఉన్న గోపీచంద్, చాముండేశ్వరి తెలంగాణ వారా ..
జైబోలో తెలంగాణ సినిమాలో ప్రధాన పాత్ర జగపతి బాబు పోషించడాన్ని ఎందుకు తెలంగాణకు తక్కువ తనంగా భావించలేదు ?
రాంగ్ రూట్లో మాజీ ఐపీఎస్
ప్రాంతీయ వాద రాజకీయం ఓ స్థాయి వరకు బాగానే ఉంటుంది. కానీ దాన్నే పదే పదే ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా విరక్తి పుడుతుంది. టీఆర్ఎస్ పేరుతో ప్రాంతీయ వాద రాజకీయం చేసి చాల వరకూ లబ్ది పొందారు. తర్వాత ఆ తెలంగాణనే అవసరం లేదని పార్టీ పేరు కూడా మార్చుకున్నారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు అధికారం ఊడిపోయిన తర్వాత మళ్లీ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీలో చేరి… తానో పెద్ద తెలంగాణ వాదినన్నట్లుగా సంగీతానికి ప్రాంతీయత అంటగడితే ఇప్పటి వరకూ సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకే మచ్చ పడుతుంది. ఇప్పటికే రాజకీయంగా తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ఫేడవుట్ అయ్యే స్థితికి వచ్చిన ప్రవీణ్.. చివరికి ఎటూ కాకుండా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
గ్రేటర్ లోనూ ఆశలు వదులుకుంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ తెలంగాణ సాధించిన తర్వతా రాజకీయ పంధాలో మారింది. సెంటిమెంట్ రాజకీయాలు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టుడుకు కాలం చెల్లిందని అర్థం చేసుకోకపోతే కష్టమే. ఎందుకంటే అధికారంలో ఉన్న పదేళ్లలో ఆంధ్రులకు.. ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసిన వారిని నెత్తిన పెట్టుకున్నారు. అధికారం పోయాక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తే … అంతో ఇంతో ఉనికి కపాడుకున్న గ్రేటర్ పరిధిలో కూడా పునాదులు కదిలిపోయే ప్రమాదం ఉంది.