భారతీయ జనతా పార్టీని వెనుక ఉండి నడిపించే ఆరెస్సెస్ కీలక సమావేశాలు విశాఖపట్నంలో గప్ చుప్‌గా ప్రారంభమయ్యాయి. గురువారం ప్రారంభమైన ఈ సమాశాలు శనివారం వరకూ జరుగుతున్నాయి. జనబాహుళ్యానికి దూరంగా ఆర్.ఎస్.ఎస్ పదాధికారుల సమావేశాన్ని విశాఖ పట్నంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఆర్.ఎస్.ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు. ఏపీ బీజేపీ ముఖ్య నేతలకు కూడా.. ఈ సమావేశాలకు ఆహ్వానం లేదు. కానీ మోహన్ భగవత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంటికి భోజనానికి వెళ్లారు. సుమారు గంట సేపు విష్ణుకుమార్ రాజు కుటుంబసభ్యులతో ఆయన గడిపారు.
ఆరెస్సెస్ ప్రధానంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా విస్తరించాలన్నదానిపై కసర్తు చేస్తున్నట్లు సమాచారం. అగ్రవర్ణాలను కాకుండా.. దళితులను ఎలా ఆకట్టుకోవాలన్న అంశంపైనే దృష్టిపెట్టారు. ఫుల్ టైమర్లు దళిత వాడల్లో ఉండి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, సంఘ్ భావాజాలాన్ని వారిలో ఎక్కించడానికి అవసరమైన చర్యలను ఆరెస్సెస్ అగ్రనేతలు పదాదికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. రానున్న ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణ, ఒడిషాల్లో ఆరెస్సెస్ ప్రభావం ఎంతో కొంత చూపించాలని భావిస్తున్నారు. సంఘ్ భావజాలాన్ని అర్ధం చేసుకుని సిద్దాంతాలను పాటించే వారిని మరింతమందిని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, పార్టీ విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలు, కేంద్ర పధకాలకు ప్రచారం సరిగ్గా చేయడంలేదన్న అసంతృప్తి, సంఘ్ భేటీలో కొంతమంది వ్యక్తం చేసినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో సంఘ్ ప్రభావం కనిపించాలనే వ్యూహంతోనే సాగరతీరంలో మధనం ప్రారంభించారు. ఈ రోజు.. పదాథికారుల సమావేశలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉందని ఆరెస్సెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర కీలక నేతలు కూడా హాజరవనున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 11వ తేదిన అంటే శనివారం సంఘ్ పదాదికారులు, సేవకులు, సంచాలకులు సుమారు రెండు వేల మందితో బహిరంగసభలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.