రిజర్వేన్ల విధానాన్ని సమీక్షించడానికి కమిటీ వెయ్యాలన్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్ సూచన బిజెపి పాలిట గుజరాత్ గొయ్యి, బీహార్ నుయ్య అన్నట్టువుంది. (పటేళ్ళకు) పాటీదార్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి అనేనినాదంతో హార్ధిక్ పటేల్ నాయకత్వంలో గుజరాత్ లో ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో మోహన్ భగత్ తమ సంస్ధ పత్రిక పాంచజన్య లో ఈ వ్యాఖ్యానం చేశారు.
గత శాసనసభ ఎన్నికల్లో పటేళ్ళే గట్టి మద్దతుదారులుగా వున్న బిజెపికి గుజరాత్ లో బిజెపి 9 శాతం ఓట్ల ఆధిక్యత లభించింది. పటేళ్ళే దూరమైతే బిజెపి బలంపడిపోతుంది. వారి ఉద్యమం విస్తరించకపోయినా ఇప్పట్లో ఆగేటట్టులేదు. ఈ స్ధితిలో మోహన్ భగత్ వ్యాఖ్యానం ఉద్యమకారులకు పరోక్షంగా అయినా మద్దతు ఇచ్చేదే అయివుండాలి. అందుకు భిన్నంగా ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేష న్లను రద్దు చేసే కుట్రలా పటేళ్ల ఉద్యమం కనిపిస్తున్నదని బిజెపి మద్దతుదారులైన దళితుల్లో వ్యక్తమౌతోంది. ”మాకూ రిజర్వేషన్లు ఇవ్వండి లేదా మొత్తం రిజర్వేషన్లను తీసేయండి” అని హార్ధిక్ పటేల్ ప్రకటించడం వారిని ఆందోళనలోకి నెట్టింది. ఇదేసమయంలో రిజర్వేషన్ల పై సమీక్షకు మోహన్ భగత్ చేసిన సూచన ఆందోళనను మరింత పెంచింది. వారి మనోభావాలను ప్రతిబింబించేలా, హార్దిక్ పటేల్ ఉద్యమానికి వ్యతిరేకంగా దళిత నాయకుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడు ఉదిత్ రాజ్ డిసెంబర్లో ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
హిందూత్వమే ప్రధాన ఆసక్తి అయివున్న ఆర్ ఎస్ ఎస్, అనుబంధ సంస్ధల ప్రభావం బీహార్ లో వుండదు. మతపరమైన ఉద్వేగం ఉవ్వెత్తున ఎగసిన 1991 పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఉత్తరప్రదేశ్ లో 51 సీట్లు గెల్చుకోగా పక్కనే వున్న బీహార్ లో కేవలం 5 సీట్లే గెల్చుకోవడం ఇందుకు ఉదాహరణ. గుజరాత్ లో అశాంతిని అణచేందుకు భగవత్ ప్రయత్నిస్తుంటే… మరోవైపు రిజర్వేషన్ల వ్యతిరేక వ్యాఖ్యలు బీహార్ ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం చూపుతాయని బీజేపీ కలత చెందుతోంది. ఫలితంగా లాలూ ప్రాధాన్యత ఇస్తున్న రిజర్వేషన్ల విధానంపై బీహార్ ఎన్నికలను నితీష్ శిబిరం ఒక రిఫరెండంగా మార్చేసే పక్షంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశముందని బీజేపీ గ్రహించింది.ఈ వాస్తవాన్ని గుర్తిండం వల్లే రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించేందుకు తాము వ్యతిరేకమంటూ బీజేపీ ఖండించింది. కాగా, గుజరాత్లో పటీదార్ల ఉద్యమాన్ని నియంత్రించడం బీజేపీకి సవాల్‌గా పరిణమించనుంది. దశాబ్దాలతరబడి బీజేపీ.. తిలక్, తరాజు, తల్వార్
(బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు) తదితర వర్గాలు పార్టీగా నిలుస్తోంది. అగ్రవర్ణాల మద్దతుతో బీజేపీ, సంఘ్‌లు రిజర్వేషన్లకు వ్యతిరేకతతోనే వున్నాయి.
అయితే ప్రస్తుతం బీజేపీ సామాజిక వర్గాల పరిధి విస్తృతమైంది. కేంద్రంలో అధికారంలోకి రావడం ద్వారా దేశంలోని ప్రతీ కులం, మతం బీజేపీ గొడుగు కిందకు వచ్చినట్లే. మరింత విస్తరించిన పరివార్ సభ్యుల మధ్య వ్యతిరేకతలు పెరుగుతున్నాయి. రిజర్వేషన్ల విషయాన్ని పటేళ్లు, సంఘ్ పరివార్ ఓవైపు లాగుతుంటే… బీహార్ ఎన్నికలు, దళితులు మరోపక్కకి లాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ గుజరాత్‌ను నిలుపుకుంటూ బీహార్‌ను కూడా సొంతం చేసుకోగలదా???