ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్) గణవేష్ (డ్రెస్ కోడ్) నిక్కరు నుంచి పాంటులోకి మారుతోంది. సంస్ధ ఏర్పడినప్పటి నుంచీ, అంటే 91 ఏళ్ళుగా స్వయం సేవకులు ఖాకీ నిక్కర్లు, మోచేతివరకు మడిచి ఉండే నిండు చేతుల తెల్లచొక్కాలు, నలుపు టోపీలు ధరిస్తున్నారు.
2010లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లోనే యూనిఫామ్‌లో మార్పు అంశం చర్చకు వచ్చింది ఏకాభిప్రాయం రాని కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు.
యూనిఫామ్‌లో ఖాకీ నిక్కరు స్థానంలో కాఫీ గింజ రంగు ట్రౌజరు (బ్రౌన్ ప్యాంట్)ను ప్రవేశపెట్టాలని ఆరు సంవత్సరాల తరువాత నిర్ణయించారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ఆర్ఎస్ఎస్ అత్యున్నత స్థాయి నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యువకులను ఆకట్టుకోవడం కోసం కొత్త యూనిఫామ్‌గా ఖాకీ నిక్కర్ల స్థానంలో బ్రౌన్ రంగు ట్రౌజర్లను ప్రవేశపెడుతున్నామని ఆర్ఎస్ఎస్ ప్రదాన కార్యదర్శి భయ్యాజీ జోషీ చెప్పారు.
‘ఈ రోజుల్లో ట్రౌజర్లు సర్వ సాధారణమై పోయాయి. కాలంతోపాటు మారే మనుషులం మేము. అందువల్ల డ్రెస్ కోడ్‌ను మార్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని వ్యాఖ్యానించారు.
బారతీయ జనతా పార్టీ ఆత్మ అయిన ఆర్ ఎస్ ఎస్ విస్తృతి బాగా పెరుగుతోంది. తాజాగా ఏడాదికాలంలో దేశవ్యాప్తంగా ఆ సంస్ధ శాఖల సంఖ్య 5 వేలకు పెరిగి 57 వేలకు చేరుకుంది. 2012 – 2015 సంవత్సరాల మధ్య శాఖలు 10 వేల వరకూ పెరిగాయి.
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక హిందూత్వ భావనల వ్యాప్తిలో మిలిటెన్సీ ధోరణులు పెరుగుతున్నాయి. సెక్యులరిస్టులు, మతవాదుల మధ్య ఘర్షణాత్మక వైఖరుల మధ్య “అసహనం” పుట్టుకొచ్చింది. రోహిత్ మరణం, కన్హయ్య అరెస్టుల అనంతరం దేశభక్తులు, దేశద్రోహులు అనే ముద్రలు మొదలయ్యాయి.
ఈధోరణుల వెనుక ఆర్ ఎస్ ఎస్ శాఖల విస్తరణ వుంది. విస్తరణ వెనుక హిందుత్వ వాదం పెరుగుదల వుంది. ఇపుడు డ్రెస్ కోడ్ కూడా మారడంతో ముఖ్యంగా యువకుల్లో స్వయం సేవకుల శాఖలు, స్వయం సేవకుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.