కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. బీజేపీ అనుబంధ హిందూ సంస్థల మోరల్ పోలీసింగ్… అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వాలెంటైన్స్ డే నుంచి న్యూఇయర్ వరకూ ఏదీ జరుపుకోవద్దని.. హెచ్చరికలు కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఆరెస్సెస్ సినిమాలకు మోరల్ సెన్సారింగ్‌కు సిద్ధమయింది. సంజయ్ దత్ బయోపిక్‌గా విడుదలైన “సంజు” సినిమాపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆరెస్సెస్ పత్రిక పాంచజన్య.. చాలా పెద్ద కథనమే ప్రచురించించిది.
సంజయ్ దత్ ఎలా గొప్పవాడు అంటూ… పాంచజన్య ఎడిటర్ చాలా పెద్ద క్వశ్చన్ మార్క్‌తో కథనం రాసేశారు. అండర్ వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని మండిపడ్డారు. బాంబు పేలుళ్లు, మత హింసలో పాల్గొన్నవ్యక్తి… మూడుసార్లు పెళ్లి చేసుకున్న వ్యక్తి.. 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి జీవిత చరిత్రను ఎలా తెరకెక్కిస్తారని ఎడిటర్ మండిపడ్డారు. అంతే కాదు.. హాలీవుడ్లో రామానూజన్ జీవిత చరిత్రను సినిమా తీస్తున్నారని… ఇక్కడ మాత్రం… సంజయ్ దత్ లాంటి వాళ్ల బయోపిక్ తీస్తున్నారని ఆరెస్సెస్ విమర్శించింది. ఇవే కాదు.. మోరల్ సెన్సారింగ్ ఎంత చేయాలో.. అంత చేశారు.
బీజేపీ హయాంలో.. సినిమాలను కూడా సినిమాలుగా చూడటం లేదు. పద్మావత్ సినిమా ఎదుర్కొన్న కష్టాలు ఎవరూ మర్చిపోరు. చివరికి దర్శకుడిని కొట్టినా.. కేసుల్లేవు. చంపుతానని బెదిరించిన కేసులు లేవు. ఆ ధైర్యంతోనే.. ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీపై పెత్తనం చెలాయించేందుకు సిద్ధపడుతున్నారు. చివరికి ఎవరి బయోపిక్‌లు తీయాలో కూడా నిర్దేశించే పరిస్థితికి చేరిపోయారన్న ఆగ్రహం ఫిల్మ్ ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. కానీ బయటకు అనే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు.